NTV Telugu Site icon

Actor Darshan case: రేణుకా స్వామిని చంపేందుకు 17 మంది కుట్ర.. దర్శన్ కేసులో సంచలన విషయాలు..

Actor Darshan

Actor Darshan

Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్శన్, పవిత్ర గౌడ సహజీవనంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాడనే కారణంగా 33 ఏళ్ల రేణుకా స్వామి అనే వ్యక్తిని చంపేశారు. ఈ హత్యలో దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారు. వీరంత రేణుకా స్వామి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. బాధితుడిని కట్టేసి కర్రలతో కొట్టడంతో పాటు కరెంట్ షాక్‌కి గురిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

దర్శన్ సన్నిహితులు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని బెంగళూర్‌కి పథకం ప్రకారం తీసుకువచ్చి, చిత్రహింసలకు చేసిన హతమార్చారు. ప్రణాళిక అమలులో కీలకంగా ఉన్న నలుగురు నిందితులను నెంబర్-2గా పోలీసులు పేర్కొన్నారు. దర్శన్ వీరికి రూ. 50 లక్షలు చెల్లించి ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అపహరణ మరియు హత్య, అలాగే మృతదేహాన్ని పారవేయడం వంటి అన్ని అంశాలను నిర్వహించడానికి ప్రదోష్ (అలియాస్ పవన్) అనే వ్యక్తికి చెల్లించిన ₹ 30 లక్షలు ఇందులో ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. నిఖిల్, కేశవమూర్తి మృ‌తదేహాన్ని పారేయడంతో కీలకం వ్యవహరించడంతో వీరికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: Online Trolling: బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేక్‌అప్ తర్వాత టీనేజర్‌పై ట్రోలింగ్.. ఆత్మహత్య..

దర్శన్, పవిత్ర గౌడల స్థానంలో నేరాన్ని ఒప్పుకుని, జైలుకు వెళ్లేందుకు రాఘవేంద్ర, కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చెల్లించారు. జూన్ 8న చిత్రదుర్గ నుంచి స్వామిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాదాపుగా 72 గంటల పాటు కుట్రకు పాల్పడినట్లు తేలింది. కామాక్షి పాళ్యకు స్వామి డెడ్ బాడీని డంప్ చేయడానికి రవిశంకర్ టాక్సీని ఏర్పాటు చేశాడు. ఇతను జూన్ 10న పోలీసులు ముందు లొంగిపోయారు. నలుగురు నిందితులు రేణుకాస్వామి అపహరణ, హత్యను అంగీకరించినట్లు ఏసీపీ చందన్ కుమార్ తెలిపారు. ఈ నలుగురితో పాటు దర్శన్, పవిత్ర గౌడలు ఈ హత్యలో కీలకంగా ఉన్నారు.

తల, పొత్తికడుపులో గాయాలు, అంతర్గత రక్తస్రావం కారణంగా స్వామి మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసులో స్వామిని చిత్రహింసలు పెట్టిన షెడ్‌లో రక్తపు మరకలు, క్యాబ్‌లో అతని జట్టు, ఇతర శరీర ద్రవాలను ఫోరెన్సిక్ సేకరించారు. షెడ్ చుట్టుపక్కట సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ, సీసీ కెమెరాల్లో దర్శన్‌కి సంబంధించిన కార్లు రికార్డయ్యాయి. స్వామిని బెంగళూర్ తీసుకువచ్చిన కారును చిత్రదుర్గ జిల్లాలోని అయ్యన హళ్లిలో స్వాధీనం చేసుకున్నారు.