PM Modi: అవినీతి నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారు. జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత అవినీతి నేతలపై సమగ్ర విచారణ చేపడతామని మంగళవారం ఆయన అన్నారు. ఇది మోడీ గ్యారెంటీ అని, భవిష్యత్ తరాల్లో అవినీతికి పాల్పడకుండా చేస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్, జార్ఖండ్‌లోని దుమ్కాలకు ఏడో విడతలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ‘‘ పదేళ్ల క్రితం అవినీతిని నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేసి, ఆ హామీని నిలబెట్టుకున్నాను.ఇప్పుడు నేను అవినీతికి పాల్పడను, వేరే వారిని పాల్పడనివ్వను, ప్రతీ ఒక్క పైసాకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని బరాసత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన అన్నారు.
Read Also: Hyper Aadi: నందమూరి, కొణిదెల సింహాలు అసెంబ్లీలో అడుగుపెడితే వచ్చే కిక్కు మా సినిమా కూడా ఇస్తుంది!
జేఎంఎం, కాంగ్రెస్‌లు అన్ని వైపుల నుంచి జార్ఖండ్‌ని దోచుకుంటున్నారని, సహజ వనరులు ఎక్కువగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రం, నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడి అపఖ్యాతి పాలయ్యిందని ప్రధాని అన్నారు. జూన్ 4 తర్వాత అవినీతి నాయకులపై చర్యలు వేగవంతం చేస్తామని చెప్పారు. అంతకుముందు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవస్థ నుంచి అవినీతిని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఈ రోజు పెద్ద చేపలు బయటపడుతున్నాయని అన్నారు. నిందితులను పట్టుకునే స్వతంత్ర దర్యాప్తు సంస్థ, వారి నేరారోపణ లేదా విచారణపై న్యాయవ్యవస్థ నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో ప్రధాని పాత్ర ఏమీ లేదని ప్రధాని మోదీ అన్నారు.