NTV Telugu Site icon

Kerala train attack: కేరళ రైలు ఘటనలో సంచలన విషయాలు.. ఉగ్రదాడిగా గుర్తించిన ఏటీఎస్

Kerala Train Attack

Kerala Train Attack

Kerala train attack: కేరళలో నడుస్తున్న రైలులో అగ్నిప్రమాదం, ముగ్గురు మరణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనలో నిందితుడు షారూఖ్ సైఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. షారూఖ్ సైఫీ జరిపింది ఉగ్రదాడి అని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) నిర్ధారించింది. అతడిపై యూఏపీఏ(ఉపా చట్టం)ప్రయోగిస్తామని కేరళ డీజీపీ అనిల్ కాంత్ వెల్లడించారు. 2019 షాహీన్ బాగ్ ఆందోళన సమయంలో షారూఖ్ ఉగ్రవాదం వైపు మళ్లినట్లు విచారణలో తేలింది. గతేడాది నుంచి ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోలను చూస్తున్నాడని మహరాష్ట్ర ఏటీఎస్ వెల్లడించింది. ఇదిలా ఉంటే నిందితుడికి కోజికోడ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, వైద్య పరీక్షలు పూర్తయ్యాకే ప్రశ్నిస్తామని అన్నారు.

Read Also: Pink Moon: ఈ పౌర్ణమిని “పింక్ మూన్”గా ఎందుకు పిలుస్తారో తెలుసా..?

కేరళ రైలులో అటాక్ కేవలం ట్రయిలర్ మాత్రమే అని ఏటీఎస్ విచారణలో షారూఖ్ వెల్లడించినట్లు సమాచారం. గతేడాది నుంచి అతని ప్రవర్తన పూర్తిగా మారినట్లు ఏటీఎస్ విచారణలో తేలింది. నమాజ్ లోనే ఎక్కువ సమయం గడిపేవాడని, స్మోకింగ్ మానేసినట్లు తేలింది. అతడిలో మతపరమైన మార్పును గమనించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉత్తరాదికి చెందిన షారూఖ్ కేరళ ఎందుకు వెళ్లాడనే దానిపై విచారించనున్నారు.

ఏప్రిల్ 2న అలపూజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. ఈ ఘటనలో 9 మందికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటన తర్వాత ఏడాది వయసు ఉన్న చిన్నారి, ఒక మహిళతో పాటు ముగ్గురు మరణించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు షారూఖ్ సైఫీ తప్పించుకుని పారిపోయాడు. అయితే మహారాష్ట్ర ఏటీఎస్ ఇతడిని రత్నగిరిలో పట్టుకున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై కేరళ పోలీస్ తో పాటు ఎన్ఐఏ విచారిస్తోంది.