CJI: అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి సైతం న్యాయం అందుబాటులోకి రావల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ప్రస్తుతం మనందరి ముందున్న అతిపెద్ద సవాల్ అదేనని అన్నారు. వారికీ న్యాయం అందుబాటులోకి. సుప్రీంకోర్టును రెండు దశల్లో విస్తరించబోతున్నట్టు తెలిపారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుప్రీంకోర్టును రెండు దశల్లో విస్తరించబోతున్నట్లు సీజేఐ ప్రకటించారు. భవిష్యత్తు సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి న్యాయస్థానాలను ఆధునికీకరించడంలో భాగంగా సుప్రీంకోర్టు విస్తరణకు ప్రణాళిక రూపొందించామన్నారు. మరో 27 కోర్టులు, 4 రిజిస్ట్రార్ కోర్టురూమ్‌ల నిర్వహణకు అనుగుణంగా కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు విస్తరణ తొలిదశలో ఇప్పుడున్న మ్యూజియం, అనుబంధ భవనాన్ని తొలగించి 15 కోర్టుల నిర్వహణకు వీలుగా కొత్త భవనం నిర్మిస్తామని తెలిపారు. అందులోనే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ కోసం గ్రంథాలయాలు, ఈ రెండు సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల కోసం కార్యాలయాలు, వాటి పదాధికారుల సమావేశాల కోసం గదులు, న్యాయవాదులు, కక్షిదారుల కోసం క్యాంటీన్ నిర్మిస్తామని స్పష్టం చేవారు. ఇందుకు సంబంధించి బడ్జెట్‌తో సహా పూర్తిస్థాయి డీపీఆర్ ఇప్పటికే తయారైందని తెలిపారు. ప్రస్తుతం న్యాయశాఖ చేతుల్లో ఉందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
Read also: Virat Kohli: చిన్నప్పటి నుంచి ఇష్టంగా చదివే ‘న్యూస్ పేపర్’ కూడా ఫేక్ న్యూస్ రాస్తోంది: విరాట్ కోహ్లీ
ఇక రెండోదశలో భాగంగా సుప్రీంకోర్టుకు అనుబంధంగా ఉన్న కోర్టు భవన సముదాయాలను కూల్చివేసి మరో కొత్త భవనం నిర్మించినున్నట్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. అందులో 12 కోర్టు గదులు, రిజిస్ట్రార్ కోర్టులు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్‌లకు లాంజ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కొత్త భవనాలు దేశ ప్రజల ప్రాధాన్యతలు, రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేరుస్తాయని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. న్యాయం అందించే క్రమంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించడానికి పూర్తిస్థాయిలో సాంకేతికను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సీజేఐ తెలిపారు. ఈ-కోర్ట్స్ ప్రాజెక్ట్ మూడో దశను అమలుచేస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వం రూ.7వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందని .. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులను అనుసంధానిస్తామని తెలిపారు. న్యాయస్థానాల పనితీరులో విప్లవాత్మక మార్పులు వస్తాయని.. కోర్టులను కాగితరహితంగా మార్చడంతో పాటు, రికార్డులన్నింటినీ డిజిటలీకరిస్తామన్నారు. న్యాయవ్యవస్థను తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడం తమ లక్ష్యమని జస్టిస్ చంద్రచూడ్ స్పస్టం చేశారు.