Site icon NTV Telugu

ABVP Attack On VC, Registrar: ఏబీవీపీ నాయకుల వీరంగం.. వీసీ, రిజిస్ట్రార్‌పై దాడి.. అడ్డొచ్చిన పోలీసులను వదలలేదు

Abvp

Abvp

ABVP Attack On VC, Registrar: విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి. ఇది సర్వసాధారణం. విద్యార్థుల సమస్యలపై మిలిటెంట్‌ పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థుల పోరాటాలతో ప్రభుత్వాలు కూలిన సందర్భాలు ఇండియాలో ఉన్నాయి. అయితే విద్యార్థుల సమస్యల పరిష్కారంలో అధికారులతో.. పోలీసులతో విద్యార్థి సంఘాల నాయకుల వాగ్వాదాలు.. గొడవలు సహజం. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏబీవీపీ నాయకులు రెచ్చిపోయారు. యూనివర్సిటీలో సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఆందోళన చేపట్టి చాలా సేపు అయినప్పటికీ యూనివర్సిటీ అధికారులు స్పందించలేదని.. ఏకంగా యూనివర్సిటీ వీసీ, రిజిస్ర్టార్‌పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైనా ఏబీవీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటన సాక్షాత్తు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ సొంతూరైన గోరఖ్‌పూర్‌లో జరిగింది.

Read also: Telangana Rains: తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగీ ఆదిత్యనాథ్‌ సొంతూరైన గోరఖ్‌పూర్‌లో ఏబీవీపీ నాయకులు రెచ్చిపోయారు. గోరఖ్‌పూర్‌లోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ విశ్వవిద్యాలయం (Deen Dayal Upadhyay University) వీసీ సహా ఉన్నతాధికారులపై దాడిచేశారు. అడ్డుకున్న పోలీసులపై కూడా విరుచుకుపడ్డారు. వర్సిటీలోని వివిధ సమస్యలపై ఏబీవీపీ నాయకులు విశ్వవిద్యాలయం గేటు ముందు శుక్రవారం ఉదయం ధర్నాకు దిగారు. మధ్యాహ్నం అయినప్పటికీ వర్సిటీ అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో వీసీ (VC) కార్యాలయంపై దాడిచేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు తలుపులను పగలగొట్టారు. పరిసరాలను మొత్తం చిన్నాభిన్నం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డుకోవాలని చూసిన స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డీన్‌తోపాటు పలువురు ప్రొఫెసర్లను విచక్షణా రహితంగా కొట్టారు. వీసీ, రిజిస్ట్రార్లపై సైతం చేయిచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీకి చేరుకున్నారు. విద్యార్థి సంఘం నాయకులను అడ్డుకున్న పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అధనపు బలగాలను వర్సిటీకి రప్పించారు. వర్సిటీ స్టాఫ్‌పై దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి సొంతూర్లోనే ఏబీవీపీ నాయకులు విధ్వంసానికి పాల్పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీ అండ చూసుకుని విర్రవీగుతున్నారని విమర్శిస్తున్నారు. సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Exit mobile version