Sambhaji Maharaj: ఇటీవల మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అజ్మీ మొఘల్ పాలకుడు ఔరంగజేబుని ప్రశంసించడం వివాదంగా మారింది. శివసేన, బీజేపీ అతడిపై విరుచుకుపడ్డాయి. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఇదిలా ఉంటే, మరాఠా పాలకుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం అబూ అజ్మీ నివాళులు అర్పించారు. ఆయన పరాక్రమ యోధుడని ప్రశంసించారు.
Read Also: Governor Jishnu Dev: ఆదివాసీ పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఆనందదాయకం..
మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ మొఘలులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. చివరకు మొఘలుల కుట్రకు శంభాజీ సంగమేశ్వర్‌లో పట్టుబడ్డాడు. అత్యంత క్రూరంగా శంభాజీని ఔరంగజేబు హత్య చేశాడు. ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ ‘‘ఛావా’’ శంభాజీ చరిత్ర ఆధారంగా రూపొందించబడింది. “స్వరాజ్య రెండవ ఛత్రపతి, పరాక్రమ యోధుడు, ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ బలిదానం చేసిన రోజున, నేను నా వినయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నాను” అని ఎక్స్‌లో అబూ అజ్మీ ట్వీట్ చేశారు.
ఇటీవల అబూ అజ్మీ మాట్లాడుతూ.. ఔరంగజేబు మంచి పాలకుడని, ఆయన పాలనలో భారత్ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్, బర్మా వరకు ఉండేదిన అన్నారు. మన జీడీపీ ప్రపంచ జీడీపీలో 24 శాతం ఉందని, భారత దేశాన్ని అతడి పాలనలో ‘‘బంగారు పిచ్చుక’’గా పిలిచే వారని అన్నారు. ఔరంగజేబు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్య జరిగిన పోరాటాన్ని రాజకీయ పోరాటంగా అభివర్ణించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన పార్టీలు తీవ్రంగా స్పందించాయి. యావత్ మహారాష్ట్రలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను మహారాష్ట్ర శాసన సభ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అతడిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.