NTV Telugu Site icon

Election Survey: గుజరాత్‌లో మళ్లీ వికసించేది కమలమే..!!

Gujarath Bjp Survey

Gujarath Bjp Survey

Election Survey: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఆమ్‌ఆద్మీ కూడా పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ మేరకు గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కమలం పార్టీనే విజయం సాధిస్తుందని సర్వే రిపోర్టుల్లో స్పష్టమైంది. అయితే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ప్రభావం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పడుతుందని సర్వే అభిప్రాయపడింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Read Also:Narabali : దేశ రాజధానిలో ఘోరం.. ఆరేళ్ల చిన్నారి నరబలి

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 46.8 శాతం, కాంగ్రెస్ పార్టీకి 32.3 శాతం, ఆప్‌కు 17.4 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలను కైవసం చేసుకోగా వచ్చే ఎన్నికల్లో 135-143 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ పార్టీకి 36 నుంచి 44 స్థానాలు వచ్చే అవకాశం ఉందని.. ఆప్‌కు రెండు స్థానాలు మాత్రమే వస్తాయని సర్వే తెలిపింది. ఇతరులు 0-3 సీట్లు పొందే అవకాశం ఉందని వివరించింది. అటు ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ మరోసారి అధికారంలోకి రావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలు ఉండగా బీజేపీకి 37 నుంచి 45 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.