పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఆప్ దూకుడు ముందు సీఎం, మాజీ సీఎంలు, రాజకీయ దిగ్గజాలు సైతం తోకముడవాల్సి వచ్చింది.. సీఎం చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్, ఏకంగా ఐదుసార్లు సీఎంగా సేవలు అందించిన ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు కూడా ఓటమి తప్పలేదు. అయితే, సిట్టింగ్ సీఎం చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలవడం చర్చగా మారింది… ముఖ్యంగా బదౌర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్.. సీఎం చన్నీపై గ్రాండ్ విక్టరీ కొట్టేశారు.. దీంతో లాభ్ సింగ్ గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
Read Also: UP Result 2022: ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఒవైసీ..
సీఎం చరణ్ జీత్ చన్నీని ఓడించిన లాభ్ సింగ్ ఎవరు? అని వెతుకుతున్నారు నెటిజన్లు.. ఇక, లాభ్ సింగ్ విషయానికి వస్తే.. ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి అతను.. తండ్రి డ్రైవర్, తల్లి స్వీపర్‌గా పనిచేస్తున్నారు.. 1987లో జన్మించిన లాభ్ సింగ్.. 12వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు.. ఇక, మొబైల్ రిపేర్ షాప్ నడుపుతూ.. మొబైల్ రిపేర్లతో జీవనం గడిపే లాభ్ సింగ్.. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. బదౌర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం గ్రామాలను చుట్టేశాడు.. సమస్యలపై అధ్యయనం చేశాడు.. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఓటర్లను ఆకట్టుకున్నాడు.. అయితే, గత ఎన్నికల్లో గెలిచిన ఆప్ అభ్యర్థి పార్టీని వీడడం లాభ్ సింగ్‌కు లాభం చేకూర్చింది.. 2017 బదౌర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. దీంతో ఆప్ టికెట్ను లాభ్ సింగ్కు వచ్చింది.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న లాభ్ సింగ్.. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు ఉండడంతో.. ఆ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ.. ఓటర్లను ఆకట్టుకున్నాడు.. సీఎంనే ఓడించి సంచలనంగా మారాడు.
