ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని మోడీ వేశారు. అనంతరం ఎంపీలంతా ఒక్కొక్కరిగా ఓట్లు వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపాయి. కానీ ఆ పార్టీ ఎంపీలు మాత్రం క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్, ఆర్జేడీ ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్.. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి కాకుండా ఎన్డీఏ అభ్యర్థి సీపీ.రాధాకృష్ణన్‌కు ఓటేశారు. దీంతో పార్టీ నిర్ణయాన్ని ఆ ఎంపీలిద్దరూ ధిక్కరించారు.
రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఏజెంట్లుగా కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రామ్ మోహన్ నాయుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే వ్యవహరిస్తున్నారు.
ఇక ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ.రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బరిలో ఉన్నారు. లోక్‌సభలో 543 మంది ఎంపీలు ఉండగా.. రాజ్యసభలో 233 మంది సభ్యులు ఉన్నారు. ఇక 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉండగా.. 5 రాజ్యసభ, 1 లోక్‌సభ స్థానం ఖాళీగా ఉంది. మొత్తం 781 మంది ఎంపీలు ఓటులో పాల్గొననున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేడీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి.అలాగే పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ (SAD) కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
రామమందిరంలో రాధాకృష్ణన్ ప్రార్థనలు
ఇక ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఢిల్లీలోని లోధి రోడ్ ప్రాంతంలో రామమందిరాన్ని సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారత జాతీయవాదం పెద్ద విజయం సాధించబోతుందని రాధాకృష్ణన్ మీడియాతో వ్యాఖ్యానించారు. మనమందరం ఒక్కటేనని.. భారతదేశం విక్షిత్ భారత్‌గా మారాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
