Site icon NTV Telugu

Waqf Bill: “వక్ఫ్ బిల్లు”ను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఆప్ ఎమ్మెల్యే..

Waqf Bill

Waqf Bill

Waqf Bill: ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన చారిత్రాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని పార్లమెంట్‌ ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారబోతోంది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలు బిల్లుకు మద్దతు పలికాయి. కాంగ్రెస్‌‌, ఎస్పీ, ఆప్, ఎంఐఎం, టీఎంసీ వంటి ఇండీ కూటమి పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. ఎన్డీయే ప్రభుత్వానికి సంఖ్యా బలం ఉండటంతో బిల్లు సులభంగానే పాస్ అయింది.

Read Also: Bandi Sanjay : మోడీ బియ్యంపై గ్రామ గ్రామాన ప్రచారం చేస్తాం

ఇదిలా ఉంటే, ప్రస్తుతం వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావెద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ కూడా వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

అమనతుల్లా ఖాన్ తన పిటిషన్‌లో.. ఈ సవరణలు ముస్లింల మతపరమైన, సాంస్కృతిక స్వయంప్రతిపత్తిని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం మైనారిటీలు తమ మతపరమైన, స్వచ్ఛంద సంస్థలను నిర్వహించే హక్కులను దెబ్బతీస్తుందని పిటిషన్‌లో చెప్పారు. అయితే, ఈ చట్టం ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచుతుందని బీజేపీ చెబుతోంది. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటను సవాల్ చేస్తూ, సమానత్వ హక్కు, మతపరమైన వ్యవహారాల నిర్వహణ, మైనారిటీల హక్కులతో సహా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తుందని ఆప్ ఎమ్మెల్యే తన వాదనల్ని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Exit mobile version