Site icon NTV Telugu

Aam Admi Party: అహ్మదాబాద్‌లో కేజ్రీవాల్ పర్యటన.. ఆప్ కార్యాలయంలో పోలీసుల సోదాలు!

Arvind Kejriwal

Arvind Kejriwal

Aam Admi Party: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆప్ కార్యాలయంలో గుజరాత్ పోలీసులు ఆదివారం సాయంత్రం సోదాలు చేసి ఏమీ కనుగొనకుండా వెళ్లిపోయారని ఆప్ నేతలు ఆరోపించారు. అయితే అహ్మదాబాద్ పోలీసులు మాత్రం అలాంటి దాడులు చేయలేదని కొట్టిపారేశారు. గుజరాత్‌ పర్యటన నిమిత్తం దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అయితే ఆయన నగరానికి వచ్చిన కొద్ది గంటలకే అహ్మదాబాద్‌లోని ఆప్‌ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరపడం వివాదాస్పదంగా మారింది.

అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పురా ప్రాంతంలో గల పార్టీ కార్యాలయంలో స్థానిక పోలీసులు సోదాలు జరిపారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విటర్‌లో వెల్లడించింది. రెండు గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో వారికి ఏం దొరకలేదని పేర్కొంది. కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ అయిన కొద్ది గంటలకే ఈ సోదాలు జరిగాయి. దీంతో ఈ పరిణామాలపై దిల్లీ ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

“గుజరాత్ ప్రజల నుంచి ఆప్‌కు లభిస్తున్న అపారమైన మద్దతుతో బీజేపీ భయపడుతోంది. ఆప్‌కు అనుకూలంగా గుజరాత్‌లో తుఫాను ఏర్పడుతోంది. ఢిల్లీ తర్వాత ఇప్పుడు గుజరాత్‌లో కూడా దాడులు చేయడం ప్రారంభించింది. ఢిల్లీలో ఏమీ దొరకలేదు, గుజరాత్‌లో ఏమీ దొరకలేదు. మేము నిజాయితీ గలవారం. దేశభక్తి గలవారం” అంటూ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అటువంటి దాడులు జరగలేదని అహ్మదాబాద్ పోలీసులు ఈ ఉదయం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాము మళ్లీ వస్తామని పోలీసులు స్పష్టంగా చెప్పారని ఆ పార్టీ గుజరాత్ నాయకుడు ఇసుదాన్ గాధ్వీ ట్వీట్ చేశారు. ఈ సాయంత్రం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో అహ్మదాబాద్‌కు చేరుకున్న కేజ్రీవాల్ మాట్లాడుతూ ఆప్‌కి లభిస్తున్న ప్రజల మద్దతు చూసి బీజేపీ దిగ్భ్రాంతి చెందిందని మండిపడ్డారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపణలపై నవరంగ్‌పురా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పీకే పటేల్‌ మాట్లాడుతూ.. ‘‘సోదాలపై ఆప్‌ నేతల ట్వీట్లు చూడగానే ఆదివారం రాత్రి నేనే స్వయంగా పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించాను. తనిఖీలు చేసేందుకు ఎవరు వచ్చారనే వివరాల గురించి అక్కడ ఉన్న నేతలను అడిగాను. కానీ ఆప్‌ నేతలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’’ అని పేర్కొన్నారు.

Saudi Arabia: సౌదీ యువరాజును కలిసిన విదేశాంగమంత్రి.. ప్రధాని మోడీ రాతపూర్వక సందేశం అందజేత

మరోవైపు, ఆప్ సర్కారుకు లోఫ్లోర్‌ బస్సుల వ్యవహారం రూపంలో మరో చిక్కు వచ్చి పడింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్‌ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశించారు. దీంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ 1,000 లోఫ్లోర్‌ బస్సులను కొనుగోలు చేయడంపై చీఫ్‌ సెక్రటరీ సురేశ్‌ కుమార్‌ సూచనల మేరకు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభించిందని తెలిపాయి. కాగా, ఈ దర్యాప్తు కేవలం రాజకీయ ప్రేరేపితమైనదని ఆప్‌ సర్కారు ఆరోపించింది.

Exit mobile version