Site icon NTV Telugu

Aam Aadmi Party: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించిన ఆమ్‌ఆద్మీ పార్టీ

Aam Aadmi Party Supports Yashwanth Sinha

Aam Aadmi Party Supports Yashwanth Sinha

Aam Aadmi Party: దేశంలో రాష్ట్రపతి ఎన్నికల గడువు సమీపించింది. సోమవారమే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము ఎన్నికల్లో నిలవగా.. ప్రతిపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలు కూడా తమ మద్దతు ఎవరికి అనేది ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఊహించినట్టే యశ్వంత్ సిన్హాకు తన మద్దతు తెలిపింది. ఈ మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్డీయే వైపే మొగ్గు చూపాయి. తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రాఘవ్ ఛద్దా, శాసన సభ్యురాలు ఆతిషీ, ఇతర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా ఓటు వేస్తామని వెల్లడించారు. గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము అంటే తమకు చాలా గౌరవం ఉందని.. ఈ ఎన్నికలను రాజకీయ కోణంలో చూడాల్సి రావడం వల్ల తాము ప్రతిపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రపతి ఎన్నికలకు జులై 18న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి ఆ పార్టీకి 156 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఢిల్లీ నుంచి ముగ్గురు సహా రెండు రాష్ట్రాల నుంచి 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అలాగే పార్టీకి పంజాబ్‌లో 92, ఢిల్లీలో 62, గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Exit mobile version