Site icon NTV Telugu

Gaganyaan: గగన్‌యాన్‌ ప్రయోగంలో ముందడగు.. మనుషుల్ని అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో

Gaganyaan

Gaganyaan

Gaganyaan: ఇప్పటికే చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో మరో ముందడుగు వేసింది. గగన్‌యాన్‌ ప్రయోగంను విజయవంతంగా కొనసాగిస్తోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర కలను సాకారం చేసుకునే దిశగా బుధవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్‌లో కీలక పాత్ర పోషించే ప్రొపల్షన్‌ సిస్టమ్‌ పనితీరును మెరుగుపరిచేందుకు గానూ చేపట్టిన పరీక్ష విజయవంతమైందని గురువారం ఇస్రో వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. గగన్‌యాన్‌కు సంబంధించిన సర్వీస్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎంపీఎస్‌) పనితీరును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షలు ప్రొపల్షన్‌ పనితీరును ధ్రువీకరిస్తాయి. వీటిలో వచ్చే ఫలితాల ఆధారంగా దాని పనితీరును శాస్త్రవేత్తలు మరింత మెరుగుపరుస్తారు.

Read also: BRO Movie Public Talk: ‘బ్రో’ మూవీ పబ్లిక్‌ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే..?

మానవసహిత అంతరిక్ష యాత్రలో భాగంగా ఇస్రో గగన్‌యాన్‌ను ప్రారంభించింది. ఈ యాత్ర మూడు రోజుల పాటు ఉంటుంది. ఈ మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌకను భూమికి 400 కి.మీ దూరంలోని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. మూడు రోజుల అనంతరం వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి చేర్చడమే ఇస్రో లక్ష్యం. సర్వీస్‌ మాడ్యూల్‌- సిస్టమ్‌ డిమాన్‌స్ట్రేషన్‌ మాడల్‌ (ఎస్‌ఎం-ఎస్‌డీఎం)ఫేజ్‌-2 టెస్టుల్లో భాగంగా రెండో, మూడో హాట్‌ టెస్టులను తాజాగా నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని ఇంజిన్ల పనితీరును సమీక్షించారు. థ్రస్టర్‌ ఇంజిన్లను కంటిన్యూయస్‌, పల్స్‌ మోడ్‌లలో విజయవంతంగా పరీక్షించినట్టు ఇస్రో తెలిపింది. ఈనెల 19న మొదటి హాట్‌ టెస్టును ఇస్రో నిర్వహించింది. వీటితో పాటు మరో మూడు హాట్‌ టెస్టులను నిర్వహించనున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ సర్వీస్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎంపీఎస్‌)ను బెంగళూరు, తిరువనంతపురంలోని వలియామలలో ఉన్న లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్లలో అభివృద్ధి చేశారు. ‘తరువాతి పరీక్షలో 350 సెకన్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. తదుపరి పరీక్షను చివరి కక్ష్యను చేరుకునేందుకు వీలుగా నిర్వహించనున్నాం. అందులో భాగంగా ఎల్‌ఏఎం ఇంజిన్లను కంటిన్యూయస్‌ మోడ్‌లో, ఆర్‌సీఎస్‌ థ్రస్టర్లను పల్స్‌ మోడ్‌లో మండించనున్నామని ఇస్రో తెలిపింది.

Exit mobile version