Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..

  • ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశారు..
  • విప్రో మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు..
  • టీసీఎస్ నాసిక్ ఉదంతం తర్వాత మరో ఐటీ దిగ్గజంపై ఆరోపణలు..
Wipro Case

Wipro Case

Religious Conversion: నాసిక్ టీఎసీఎస్ క్యాంపస్ మతమార్పిడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కిందిస్థాయి ఉద్యోగులు, మహిళలపై ఉన్నతాధికారుల వేధింపులు, బలవంతంగా మతమార్పిడి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు మరో సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రోపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. విప్రో పూణే క్యాంపస్‌లో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగి సంచలన ఆరోణపలు చేసింది. తన ఉన్నతాధికారి మత విశ్వాసాల కారణంగా వేధింపులకు గురిచేశాడని, ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పుణేలోని హింజేవాడి విప్రో క్యాంపస్‌లో పనిచేస్తున్న సమయంలో కొందరు సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్లు తన మత విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని వేధించారని ఆమె ఆరోపించింది.ఇస్లాం మతంలోకి మారాలి, మతానికి సంబంధించిన ఆచారాలు పాటించాలని మానసికంగా వేధించినట్లు చెప్పింది. ఇందుకు నిరాకరించినందుకు తనకు వేధింపులు పెరిగాయని, పర్ఫామెన్స్ రివ్యూల్లో చెడుగా రేటింగ్ ఇస్తామని, ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించినట్లు ఆరోపించింది. ఈ మానసిక వేధింపుల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పింది. సంస్థ అంతర్గత ఫిర్యాదు వ్యవస్థ నుంచి కూడా తనకు సరైన మద్దతు రాలేదని పోలీసులతో పాటు మానవహక్కుల సంస్థలో ఫిర్యాదుచేసింది.

×
×
Ad

ఈ వ్యవహారంపై పూణ పోలీస్ అధికారి బాలాజీ పంధారే మాట్లాడుతూ.. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై విప్రో స్పందించింది. ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. వివక్ష, వేధింపులు, మానవ హక్కుల ఉల్లంఘన పట్ల ‘‘జీరో టాలరెన్స్’’ విధానాన్ని పాటిస్తున్నామని చెప్పింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందువల్ల వివరాలు వెల్లడించలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పింది.