NTV Telugu Site icon

Kolkata Doctor case: ఆర్‌జీ కర్ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత.. మమత రాజీనామా చేయాలంటూ బీజేపీ నిరసన

Kolkata Doctor Case

Kolkata Doctor Case

కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం తర్వాత నెమ్మదిగా ఆందోళనలు సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా అల్లరిమూకలు.. ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించడంతో తాజాగా ఈ ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.

తాజాగా కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రి దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సీజీఓ కాంప్లెక్స్ వెలుపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు-బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.

ఇదిలా ఉంటే కోల్‌కతా ఘటనకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రకటించింది. ఎమర్జెనీ వైద్య సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది. అత్యవసర సేవలందించే క్యాజువాలిటీలు పని చేస్తాయని ప్రకటనలో పేర్కొంది.

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. ఆమె హత్యాచారానికి గురైన తీరు గుండెల్ని పిండేస్తోంది. అత్యంత క్రూరంగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా పోస్టుమార్టం రిపోర్టు తేటతెల్లం చేస్తోంది. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించినట్లుగా కూడా అర్ధమవుతోంది. ఆమె చాలా ఘోరంగా హింసకు గురైనట్లుగా ఘటనాస్థలిని బట్టి స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విచారణ తాత్సారం చేయడంతో కోల్‌కతా హైకోర్టు జోక్యం పుచ్చుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక దర్యాప్తు బృందం.. సంఘటనాస్థలిని పరిశీలించి వెళ్లిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే అల్లరిమూకలు ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారు.