Food Poisoning: జార్ఖండ్ రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పాడైన ‘‘ చాట్ మసాలా’’తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ఈ రోజు తెలిపారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం కర్మతాండ్ పంచాయతీ పరిధిలో జరిగింది.
Read Also: Anti-Hindu hate: బ్రిటన్ లో పెరుగుతున్న హిందూ వ్యతిరేకత.. మతం మారాలని ఒత్తిడి..
భోక్తా జాతరకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత హుచక్తాన్ ధాడ్ గ్రామ ప్రజలు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలకు గురయ్యారని వారిలో 80 మంది, ఎక్కువగా పిల్లల ఆరోగ్యం క్షీణించిందని అధికారులు తెలిపారు. రాత్రి 10.30 గంటలకు షాహిద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిట్ లో చేర్చినట్లు ఆస్పత్రి మెడికల్ విభాగం చీఫ్ డాక్టర్ యూకే ఓజా వెల్లడించారు. ఇందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
బాధితుల్లో తొమ్మిదేళ్ల పింకీ అనే బాలిక అత్యంత చిన్నవయస్కురాలు కాగా.. 44 ఏళ్ల విజయ్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇంతపెద్ద సంఖ్యలో బాధితులు రావడంతో ఎమర్జెన్సీ వార్డులో పడకలు తక్కువగా ఉండటంతో , ఇతర ఆస్పత్రుల్లోని బెడ్స్ ను సమకూర్చినట్లు డాక్టర్ ఓజా వెల్లడించారు. రోగుల రద్దీని ఎదుర్కొనేందుకు అదనపు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని పిలిచినట్లు తెలిపారు. బాధితులను పరామర్శించిన దండబ్ సివిల్ సర్జన్ డాక్టర్ అలోక్ విశ్వకర్మ ఘటనపై విచారణకు ఆదేశించారు.