Boy Fell In Borewell: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బోరు బావిలో పడిన పిల్లాడి ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఏడేళ్ల పిల్లాడిని రక్షించేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. 24 గంటల తర్వాత పిల్లాడిని బయటకు తీసినా అప్పటికే చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివారాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలో ఏడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్ శంకర్ భార్గవ తో పాటు పోలీస్, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
Read Also: Viral : ఫాలోవర్స్ కోసం డబ్బుల వర్షం.. అంతా ఆ వెబ్ సిరీస్ వల్లే..!
జిల్లాలోని లాటరి తహసీల్ పరిధిలోని ఖేర్ఖేడి పత్తర్ గ్రామంలో లోకేష్ అహిర్వార్ అనే బాలుడు ఆడుకుంటూ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 60 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిపోయాడు. 43 అడుగుల లోతులో బాలుడు కూరుకుపోయాడు. గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పిల్లాడిని బయటకు తీసేందుకు జేసీబీల సాయంతో బోరుబావికి సమాంతరంగా గుంతను తీశారు. బాలుడిని రక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందిని రంగంలోకి దింపినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
పిల్లాడు శ్వాస తీసుకునేందుకు ఆక్సిజన్ ను పైపుల ద్వారా బోరు బావిలోకి పంపించారు. అయితే దాదాపుగా 24 గంటల ఆపరేషన్ సఫలం కాలేదు. బాలుడిని బయటకు తీసే సమయానికి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రూ. 4 లక్షల సాయాన్ని ప్రకటించారు. మంగళవారం ఇదే విధంగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో కూడా 5 ఏళ్ల బాలుడు బోర్ వెల్ లో పడిపోయాడు. అతడిని బయటకు తీసే సయమంలో చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.