NTV Telugu Site icon

Stray Dogs Attack: వీధి కుక్కల దాడిలో 7 నెలల బాలుడి మృతి..

Stray Dogs Attack

Stray Dogs Attack

Stray Dogs Attack: విధికుక్కులు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలో ఏడు నెలల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి ప్రాణం తీశాయి. ఈ ఘటన బుధవారం నగరంలోని అయోధ్య నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను పోలీసులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Hanuman: హనుమాన్ ప్రదర్శించని థియేటర్లకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షాక్

ఈ ఘటన జరిగిన రోజున పిల్లాడి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. పోలీసులు మళ్లీ మృతదేహాన్ని వెలికి తీసి, శనివారం పోస్టుమార్టం కోసం పంపారు. చిన్నారి తల్లిదండ్రులు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లి పిల్లాడిని నేలపై పడుకోబెట్టి పక్కనే పనిచేసుకుంటుండగా.. ఈ దాడి జరిగినట్లు అయోధ్య నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ నిల్హరే తెలిపారు. కుక్కల గుంపు చిన్నారిని కొరికి ఈడ్చుకెళ్లిందని చెప్పారు. కుక్కల దాడిలో శిశువు శరీరం నుంచి చేయి విడిపోయింది, అక్కడిక్కడే మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే జిల్లా యంత్రాంగం బాలుడి కుటుంబానికి రూ. 50,000ల ఆర్థిక సాయాన్ని అందించింది. మరో రూ. 50,000 త్వరలో అందిస్తామని అధికారులు చెప్పారు. భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ (BMC) అయోధ్య నగర్ ప్రాంతం నుండి ఎనిమిది వీధి కుక్కలను పట్టుకుంది.