Republic Day: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు మోహరించాయి. రిపబ్లిక్ డే పెరేడ్ ను దాదాపుగా 65,000 మంది వీక్షిస్తారని ఢిల్లీ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన సర్కిళ్లలో స్నిఫర్ డాగ్ లు, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. వీరికి విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
Read Also: Mike Tyson: మైక్ టైసన్ ఓ క్లబ్‌లో నాపై అత్యాచారం చేశాడు.. న్యూయార్క్ మహిళ దావా
దేశరాజధానిలో ఎయిర్ అలర్ట్ ప్రకటించారు. అనుమతి లేకుండా ఎలాంటి డ్రోన్లను, ఇతర పరికరాలను ఎగరేయడాన్ని నిషేధించారు. జనవరి 26న జరిగే పరేడ్‌లో ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జితో సహా దాదాపు 6,000 మంది జవాన్లను భద్రత కోసం మోహరించారు. దాదాపు 150 సీసీటీవీ కెమెరాల సహాయంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వీటిలో హై రిజల్యూషన్ కెమెరాలు ఉన్నాయి. పరేడ్ నిర్వహించే ఎత్తైన భవనాలను మూసేశారు. బుధవారం రాత్రి నుంచి ఢిల్లీలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. కేవలం పాస్ లు ఉన్న వాహనాలను మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు.
దాదాపుగా రిపబ్లిక్ డే చూసేందుకు వచ్చే వారు మెట్రోను ఉపయోగించుకోవచ్చని, సెక్రటేరియట్, ఉద్యగ్ భవన్ మెట్రో స్టేషన్లను తెరిచి ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 30,000 మంది మెట్రో ద్వారా చేరుకోవచ్చని తెలిపారు. కర్తవ్య మార్గ్, జనపథ్, ఇండియా గేట్, కోపర్నికస్ మార్గ్‌లో గురువారం ఉదయం 4 గంటల నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. గణతంత్ర వేడుకలకు ఈ ఏడాది ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.