5G India Rollout: దేశంలో అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. మొదటి విడతలో 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దశల వారీగా మరిన్ని నగరాల్లో ఈ సేవలను అందించేందుకు టెలికాం సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మార్చి, 2023 నాటికల్లా దేశంలోని 200 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఇప్పటికే రిలియన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థలు పలు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. రిలియన్స్ జియో మొదటగా 5జీ సేవలను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ప్రారంభించింది. ఎయిర్ టెల్ సంస్థ ముంబై, బెంగళూరు, సిలిగురి, కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ, వారణాసి, చెన్నై నగరాల్లో 5జీ సర్వీసులను తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రముఖ నగరాల్లో 5జీని తీసుకువచ్చేందుకు ఈ రెండు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ఇప్పటి వరకు ఏ నగరంలోనూ 5 జీ సేవలను పాటించలేదు.
Read Also: Green Crackers : గ్రీన్ క్రాకర్స్‌తో మీ పిల్లల ఆరోగ్యం భ్రదం.. దీపావళికి వీటినే కొనండి..
త్వరలోనే జియో తన 5 జీ సేవలను బెంగళూర్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్ నగర్, చెన్నై, లక్నో, పూణే నగరాల్లో అందించనుంది. ఇక ఎయిర్ టెల్ అహ్మదాబాద్, గాంధీనగర్, గురుగ్రామ్, పూణే, జామ్ నగర్, చండీగఢ్ లో 5 జీ సేవలను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.
5జీలో గరిష్టంగా 20 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పొందవచ్చు. ప్రస్తుతం 4జీలో 1 జీబీపీఎస్ వేగాన్ని పొందుతున్నాము. అయితే ప్రస్తుతం 5జీని పొందాలంటే కొత్తగా 5జీ సిమ్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లు 5జీని సపోర్ట్ చేస్తే చాలు. ఇప్పటికే చాలా మొబైల్ కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. సామ్ సంగ్ తమ 5జీ ఫోన్లు నవంబర్ నాటికి 5జీని సపోర్ట్ చేస్తాయని తెలిపింది. ఆపిల్ కూడా డిసెంబర్ నాటికి 5జీ సాఫ్ట్వేర్ అప్ డేట్ విడుదల చేయాలని భావిస్తోంది.
