PM Modi: 13 ఏళ్లలో దాదాపు 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని, 1000 ఏళ్ల బానిసత్వం తర్వాత ఇదే తొలిసారి అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ తగ్గుదల దేశానికి ఒక కొత్త శకానికి నాంది అని అన్నారు. దీపావళి అనంతరం జరిగిన స్నేహ్ మిలన్లో గుజరాత్ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు.
ఈ సమావేశాలో ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. పేదరికం తగ్గుదల బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్న కారణంతో కొందరు దానిని అంగీకరించడానికి వెనకాడుతున్నారని మోడీ అన్నారు. తమ ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, పని చేసే దిశ సరైనవి కావడంతోనే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
దిగువ-మధ్య-ఆదాయ దేశాల పేదరికపు గీతకు దిగువన జీవిస్తున్న భారతీయుల వాటా 2011-12లో 57.7 శాతం నుండి 2023-24 నాటికి 16.1 శాతానికి తగ్గిందని తేల్చిన ఇటీవలి ప్రపంచ బ్యాంకు అంచనాను ప్రధానమంత్రి ప్రస్తావించారు.ఈ లెక్కల ప్రకారం దాదాపు 49.6 కోట్ల మంది ఈ పేదరిక స్థాయి నుంచి బయటపడ్డారు. ఇక అత్యంత పేదరికాన్ని కొలిచేందుకు ప్రపంచ బ్యాంక్ రోజుకు 3 డాలర్ల ప్రమాణాన్ని ఉపయోగిస్తోంది, ఈ ప్రమాణం ప్రకారం భారత్ అత్యంత పేదరికంలో ఉన్న వారి శాతం 2011-12లో 27.1 శాతంగా ఉండగా, 2023-24 నాటికి 2.6 శాతానికి తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

