NTV Telugu Site icon

Rahul Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం ఆ 5 హామీలపైనే.. అవి ఏంటంటే..?

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత ఈ రోజు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ తో పాటు 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూర్ లోని కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంగా గాంధీలతో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ డిప్యూటీ కమ్ తేజస్వి యాదవ్ హాజరయ్యారు.

Read Also: Rajasthan: ప్రభుత్వ భవనం కింద రూ.2000 నోట్ల కట్టలు, బంగారం..

అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ 5 హామీలను ఇచ్చిందని మరో రెండు గంటల్లో క్యాబినెట్ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయని ఆయన వెల్లడించారు. మేము పేదలు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల వెంట ఉన్నందుకే కాంగ్రెస్ గెలిచిందని, కాంగ్రెస్ వద్ద నిజం ఉందని, బీజేపీ వద్ద డబ్బు, పోలీసులు ఉన్నారంటూ విమర్శలు చేశారు. ద్వేషం ఓడింది, ప్రేమ గెలిచిందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ అవినీతిని, ద్వేషాన్ని ఎన్నికల్లో ఓడించారని రాహుల్ గాంధీ అన్నారు. గత ఐదేళ్లుగా మీరు పడిన బాధలు మాకు అర్థం అవుతున్నాయని అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ66, జేడీయూ 19 స్థానాల్లో గెలిచాయి.

5 హామీలు ఇవే:

1) గృహ జ్యోతి: 200 యూనిట్ల వరకు ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్

2) గృహ లక్ష్మీ: ప్రతీ కుటుంబంలోని మహిళకు నెలకు రూ. 2000 ఆర్థిక సాయం

3) అన్న భాగ్య: బీపీఎల్ కుటుంబంలోని ప్రతీ సభ్యుడికి 10 కిలోల బియ్యం

4) యువనిధి: 18-25 ఏళ్ల నిరుద్యోగ గ్యాడ్యుమేట్ యువతకు ప్రతీ నెల రూ.3000, నిరుద్యోగ డిప్లొమా యువతకు రూ.1500. రెండేళ్ల పాటు ఇలా ఆర్థికసాయం ఇవ్వనున్నారు.

5) శక్తి: పబ్లిక్ రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత ప్రయాణం.