NTV Telugu Site icon

Odisha Train accident: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తో మృతి..

Train

Train

Odisha Train accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్‌ అనంతరం పలు విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుతోపాటు.. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు.. ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పటికీ కొందరు ఎలా బ్రతికి బయటపడ్డారనే విషయాలు అధికారుల పరిశీలనలో వెలుగు చూస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 278 మంది మృతిచెందగా.. 1,100 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదంలో మరణించిన వారిలో సుమారు 40 మంది వరకు విద్యుత్‌ షాక్‌తో మరణించినట్టు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

Read also: Train Accident: ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీల్లో చిక్కుకున్న కనీసం 40 మృతదేహాలను వెలికితీయగా.. వాటిపై ఎటువంటి గాయాలు లేవని గుర్తించిన అధికారులు వారు విద్యుదాఘాతానికి గురై ఉంటారని భావిస్తున్నారు. తెగిపడిన ఓవర్ హెడ్ కేబుల్స్ ద్వారా షాక్‌కు గురై ఉంటారని .. లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్స్ బోగీలపై పడటంతో వారి మరణాలకు విద్యుదాఘాతమే కారణమని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఓవర్ హెడ్ ఎల్టీ (తక్కువ తీవ్రత) లైన్‌తో తాకిడి.. తర్వాత విద్యుదాఘాతం కారణంగా చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) సబ్-ఇన్‌స్పెక్టర్ పాపు కుమార్ నాయక్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Read also: Anupama Parameswaran: అందుకే అనుపమ అలాంటి పని చేస్తుందా?

చెన్నైకి వెళ్తోన్న కోరమాండల్ రైలు.. బహనాగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద లూప్‌లైన్‌లోకి వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు యశ్వంత్‌పూర్ (బెంగళూరు)-హౌరా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలపైకి దూసుకెళ్లడంతో కేబుల్స్ తెగిపోయాయి. చాలా వరకూ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.. అందులో సుమారు 40 మృతదేహాలపై ఎటువంటి గాయాల గుర్తులు, రక్తస్రావం అయినట్టు కనిపించలేదని .. వారి మరణానికి విద్యాదాఘాతం కారణం కావచ్చని పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ పూర్ణ చంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ రైలుపై పడి బోగీలలోని కొంత భాగాన్ని సెకనులో తాకే అవకాశం ఉందని, దీంతో విద్యుదాఘాతానికి గురై ఉంటారని చెప్పారు.