Delhi Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు వరసగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరగా, నిన్న ఆప్‌కి రాజీనామా చేసిన 08 మంది ఎమ్మెల్యేలు నేడు (శనివారం) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమకు టికెట్ ఇవ్వకపోవడంతో 08 మంది ఎమ్మెల్యేలు నిన్న ఆప్‌కి రాజీనామా చేశారు.
Read Also: EV sector: ఈవీ బ్యాటరీ తయారీకి ప్రోత్సాహం.. తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్, బైక్స్ ధరలు..
ఆప్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల్లో – గిరీష్ సోని (మాదిపూర్), రోహిత్ మెహ్రౌలియా (త్రిలోక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), రాజేష్ రిషి (జనక్‌పురి), నరేష్ యాదవ్ (మెహ్రౌలి), భావన గౌర్ (పాలం), పవన్ కుమార్ శర్మ (ఆదర్శ్ నగర్), బిఎస్ జూన్ (బిజ్వాసన్) ఉన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పార్టీలో పెరుగుతున్న అవినీతిని విలువల నుంచి వైదొలగడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు.
అయితే, ఎమ్మెల్యేల రాజీనామాలపై ఆప్ మాట్లాడుతూ.. సదరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో్ ప్రజలకు అందుబాటులో లేరని తేలడంతోనే టికెట్ నిరాకరించామని చెప్పింది. సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడంతోనే వారికి టికెట్ నిరాకరించినట్లు ఆప్ జాతీయ అధికా ప్రతినిధి రీనా గుప్తా అన్నారు. ఏదేశమైనప్పటికీ, ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ నేతలు బీజేపీలో చేరడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 08న ఫలితాలు వెలువడతాయి.