Site icon NTV Telugu

Monkey Fever Cases: కర్ణాటకలో 31 “మంకీ ఫీవర్” కేసులు నమోదు.. అసలేంటీ వ్యాధి, దాని లక్షణాలు ఏంటి..?

Moneky Fever

Moneky Fever

Monkey Fever Cases: కర్ణాటక రాష్ట్రంలో ‘‘మంకీ ఫీవర్’’ కేసులు భయాందోళనలను రేపుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో గత 15 రోజుల్లో 31 మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. వ్యాధి సోకిన వారిలో 12 మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మిగతా వారు ఇంట్లేనే వైద్యం తీసుకుంటున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు, ఇప్పటి వరకు ఎలాంటి సీరియస్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. సిద్ధాపూర్ తాలూకాలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

Read Also: Arvind Kejriwal: “ఎమ్మెల్యేల కొనుగోలు” ఆరోపణలపై ఢిల్లీ సీఎంకి క్రైమ్ బ్రాంచ్ నోటీసులు..

క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ)నే మంకీ ఫీవర్‌గా వ్యవహిరిస్తుంటారు. ఈ ఏడాది తొలి కేసు జనవరి 16న నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా కోతులపై నివసించే పేలు కుట్టడం వల్ల ఈ జ్వరం వ్యాపిస్తుంది. కోతుల్లో ఉండే పేలు మనుషుల్ని కట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. పేలు కాటుకు గురైన మనుషులు, పశువులు ఈ వ్యాధి బారిన పడుతాయి. ప్రస్తుతం ఈ వ్యాధిపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అటవీ పరిసర ప్రాంతాలలో నివసించే వారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఒకసారి మంకీ ఫీవర్ బారిన పడితే.. మూడు నుంచి 5 రోజులలో తీవ్రమైన జ్వరం, తీవ్రమైన శరీర నొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రబడట, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సార్లు ఇది ప్రాణాంతకం కూడా కావొచ్చు. మొదటిసారిగా 1957లో భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని క్యాసనూర్ ఫారెస్ట్‌లో ఈ వ్యాధిని గుర్తించారు. ప్రతీ ఏడాది ఇండియాలో 400 నుంచి 500 కేసులు నమోదవుతున్నాయి. గోవా కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఈ వ్యాధి గతంలో వ్యాపించింది. ఫ్లావివిరిడే అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇదే వైరస్ ఎల్లో ఫీవర్, డెంగ్యూకి కూడా కారణమవుతుంది.

Exit mobile version