Elephants Attack: జార్ఖండ్ రాష్ట్రంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. లతేహార్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని తొక్కి చంపేశాయి. చనిపోయిన బాధితుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం విషాదాన్ని నింపింది. శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో మల్హాన్ పంచాయతీ వద్ద ఇటుక బట్టీ యూనిట్ సమీపంలోని తాత్కాలిక గుడిసెలో 30 ఏళ్ల కూలీ ఫను భుయిన్యాన్ తన 26 ఏళ్ల భార్య బబితా దేవి, మూడేళ్ల కుమార్తెతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Read Also: Assam : బాలిక పై అత్యాచారం చేశాడు.. చంపి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు
ఘటన జరిగిన ప్రాంతం రాజధాని రాంచీ నుంచి 80 కిలోమీటర్లు ఉంది. ఇటుకబట్టీ ప్రాంతంలో ఏనుగుల గుంపు కనిపించిందని, ఒకే కుటుంబంలోని ముగ్గురిని చంపేశాయని, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఇతర కార్మికులు తప్పించుకోగలిగారని చంద్వా పోలీస్ స్టేషన్ అధికారి అమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లతేహార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లాతేహార్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రౌషన్ కుమార్ మాట్లాడుతూ.. బాలుమత్, చందవా అటవీ రేంజ్ మధ్యలో గత కొన్ని రోజులుగా సుమారు 14 ఏనుగులు సంచరిస్తున్నాయని, గురువారం సాయంత్రం చక్లా ప్రాంతంలో ఈ గుంపు కనిపించిందని, మేము ప్రజలను అప్రమత్తం చేశామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం జరిగిన ఘటన గురించి చెబుతూ.. కూలీలు నిద్రలో ఉండటంతో ఏనుగుల మంద రావడం గమనించలేకపోయారని ఆయన అన్నారు. మరణించిన కుటుంబం గర్వా జిల్లాకు చెందినది, కుటుంబ సభ్యులకు తక్షణ సాయం కింద రూ. 60,000లను అటవీ శాఖ అందించింది.
