Jammu Kahmir: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. నిషేధిత లష్కరే తోయిబా అనుబంధంగా ఉన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్మూ కాశ్మీర్ కుల్గామ్‌లో మంగళవారం భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో కమాండర్ స్థాయి ఉగ్రవాది బాసిత్ దార్ హతమయ్యాడు. ఇతను సెక్యూరిటీ ఏజెన్సీల ‘‘మోస్ట్ వాంటెడ్ లిస్టు’’లో ఉన్నారు. ఇతనిపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది. పోలీస్ సిబ్బందితో పాటు సాధారణ పౌరులను చంపిన 18 కంటే ఎక్కువ కేసుల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు కాశ్మీర్ ఐజీ తెలిపారు.
Read Also: PM Modi: “ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు”.. లాలూ వ్యాఖ్యలపై పీఎం మోడీ ఆగ్రహం..
కుల్గామ్ లోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి స్పష్టమైన సమచారం రావడంతో భద్రతా దళాలు సోమవారం అర్థరాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ మంగళవారం వరకు కొనసాగింది. హతమైన ఉగ్రవాది బాసిత్ ధార్ ‘ఏ’ కేటగరి ఉగ్రవాదిగా ఉన్నారు. ఉగ్రవాదులు శిక్షణ, క్రియాశీలత, ప్రత్యేకలను బట్టి జమ్మూ కాశ్మీర్ పోలీసులు వారిని A+, A, B మరియు Cగా వర్గీకరిస్తారు.
లష్కరేకి అనుబంధంగా ఉన్న ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ గత కొంత కాలంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతోంది. ముఖ్యంగా అమాయకమైన పౌరులు, వలస కూలీలు, హిందువులపై దాడులకు తెగబడుతోంది. బైకుపై వచ్చి లక్ష్యంగా చేసుకున్న వ్యక్తిని కాల్చి చంపి పారిపోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదుల ఏరివేతను భద్రతా బలగాలు పటిష్టంగా చేపడుతున్నాయి. దీంతో పెద్ద దాడులకు పాల్పడకుండా ఇలా టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి ఉగ్రవాదులు పాల్పడుతున్నారు.