Jharkhand: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న బొగ్గు గని కుప్పకూలింది. జార్ఖండ్‌లోని భౌరా కొల్లేరీ ప్రాంతంలో శుక్రవారం అక్రమంగా నిర్వహిస్తున్న గని పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. చాలా మంది శిథిలాల మధ్య చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. బొగ్గును వెలికి తీసేందుకు వందలాది మంది గనిలోని సొరంగాల ద్వారా ప్రవేశించారు. ఈ సమయంలో గని పైకప్పు కూలిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
Read Also: Asaduddin Owaisi: “ఔరంగజేబు” వ్యాఖ్యలపై స్పందించిన ఓవైసీ.. “గాడ్సే” సంతానం ఎవరంటూ ప్రశ్న
ఏటీదేవ్ ప్రభ ఔట్‌సోర్సింగ్ కంపెనీలో అక్రమ మైనింగ్ జరుగుతుండగా పైకప్పు కూలిపోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురై, తొక్కిసలాటకు దారి తీసింది. ఈ సమయంలో ముగ్గురు చనిపోయారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, సీఐఎస్ఎఫ్ బృందాలు ఈ ఘటనపై విచారణ ప్రారంభించాయి. ఎంత మంది చనిపోయారు, గనిలో ఎంత మంది చిక్కుకుపోయారనే వివరాలు రెస్క్యూ ఆపరేషన్ పూర్తైన తర్వాతే తెలుస్తాయని సింద్రీ డీఎస్పీ అభిషేక్ కుమార్ తెలిపారు.