NTV Telugu Site icon

Maldives: మాల్దీవులను విడిచిపెట్టిన 2వ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది.. ప్రకటించిన మహ్మద్ ముయిజ్జూ..

Muizzu, Pm Modi

Muizzu, Pm Modi

Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక, చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను, మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిన పంపిస్తానని హామీ ఇచ్చాడు. దీనిపై భారత్-మాల్దీవుల మధ్య పలు చర్చలు జరిగాయి. చివరకు భారత సిబ్బంది ఆ దేశాన్ని వదులుతున్నారు. తాజాగా 2వ బ్యాచ్ భారత సిబ్బంది మాల్దీవులను వదిలిపెట్టినట్లు ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూ ప్రకటించారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సిబ్బంది మే 10 వరకు పూర్తిగా దేశాన్ని వదిలివెళ్తారని చెప్పారు.

Read Also: Anti Tank Missile: యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ డెవలప్‌మెంటల్ ట్రయల్స్‌ను పాస్ చేసిన డిఆర్డిఓ..!

భారత సిబ్బంది ఫస్ట్ బ్యాచ్ మార్చి 10లోగా మాల్దీవులను వదిలివెళ్లాలని గడువు పెట్టారు. ఏప్రిల్ 9న రెండో బ్యాచ్ భారత సైనికులు ఆ దేశాన్ని వదిలి వెళ్లారు. ఫిబ్రవరిలో మాల్దీవులు మరియు భారతదేశం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, భారతదేశం నుండి కూడా శిక్షణ పొందిన పౌరులను, ఆ దేశానికి బహుమతిగా ఇచ్చిన మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారతీయ సైనిక సిబ్బందిని భర్తీ చేయడానికి న్యూఢిల్లీ అంగీకరించింది. మాల్దీవుల ప్రభుత్వం ప్రకారం.. ఆ దేశంలో 88 మంది భారతీయ సైనిక సిబ్బంది అడ్డూ, లాము కధూలో హెలికాప్టర్లను, హనిమాధూలో ఒక డోర్నియర్ విమానాన్ని ఆపరేట్ చేస్తున్నారు.

గతేడాది అధికారంలోకి వచ్చిన ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నాడు. చైనాకు అనుకూలంగా ఉంటూ, ఆ దేశంలో పర్యటించి, జిన్‌పింగ్‌తో పలు ఒప్పందాలను చేసుకున్నాడు. చైనా మరియు మాల్దీవులు ఇటీవల రక్షణ సహకార ఒప్పందం మరియు అనేక ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సంతకం చేశాయి. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ లక్ష ద్వీప్ పర్యటన సమయంలో ఆ దేశ మంత్రులు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది.

Show comments