Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో ఒకేసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 23 మంది లొంగిపోవడంతో పోలీసులు అతిపెద్ద విజయం సాధించారని చెప్పవచ్చు. వీరందరిపై కలిపి రూ. 1.18 కోట్ల నజరానా ఉంది. శనివారం, వీరంతా సుక్మా జిల్లా పోలీసులు ముందు లొంగిపోయారు. దీనికి ఒక రోజు ముందు, సుక్మా సరిహద్దు జిల్లా అయిన నారాయణపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టారు. సుక్మా పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త ప్రయత్నాల కారణంగా ఈ లొంగుబాటు జరిగింది.
Read Also: COVID-19: ‘‘స్ట్రాటస్’’ రూపంలో మళ్లీ తిరిగి వచ్చిన కోవిడ్-19..
లొంగిపోయిన వారిలో అనేక మంది ఉన్నత స్థాయి మావోయిస్టు కేడర్ ఉంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో కొందరిపై రూ. 8 లక్షలు పారితోషికం ఉంది. మరికొందరిపై రూ. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు రివార్డులు ఉన్నాయి. వీరిలో చాలా మంది బస్తర్ ప్రాంతంలో తీవ్రమైన హింసాత్మక దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఒకరు 2012లో అప్పటి జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ అపహరణలో పాల్గొన్నట్లు నివేదించబడింది. ఆ సమయంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్, సీఆర్పీఎఫ్ ఐజీ ఆనంద్ సింగ్ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున పునరావాసం ఉంటుందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. వారు సమాజంలో గౌరవంగా బతికేందుకు అన్ని రకాల మద్దతు ఇస్తామని చెప్పారు.
