MEA: పశ్చిమాసియాలో జరుగుతున్న అమెరికా-ఇరాన్, సౌదీ అరేబియా-హౌతీల ఘర్షణల్లో ఇప్పటి వరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. మృతుల్లో 14 మంది నావికులు ఉన్నారని తెలిపింది. మిడిల్ ఈస్ట్‌లో ఘర్షణలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో భారతీయుల భద్రత, సంక్షేమం కోసం వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పశ్చిమాసియా ఘర్షణల్లో 14 మంది నావికులతో సహా 22 మందిని భారతీయులను కోల్పోయామని అన్నారు. సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులు చనిపోయినట్లు జైస్వాల్ వెల్లడించారు.
ఫిబ్రవరి నుంచి మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేసిన తర్వాత ఈ ఘర్షణలు ప్రారంభయ్యాయి. ఈ యుద్ధం ఒక్క ఇరాన్‌కు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు వ్యాపించింది. తనపై దాడులకు ప్రతిగా సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రైయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తూ వస్తోంది. ఇక హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఇటు అమెరికా, అటు ఇరాన్ కూడా దాడులు చేశాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణ తీవ్రం అవుతోంది. హౌతీలు సౌదీ ఆయిల్ రిఫైనరీలు, ఎయిర్ పోర్టులపై దాడులు చేస్తున్నారు.

