NTV Telugu Site icon

Agnipath: ‘అగ్నిపథ్’ ఆందోళనలు.. దేశవ్యాప్తంగా 35 రైలు సర్వీసులు రద్దు

Agnipath Agi

Agnipath Agi

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై శుక్రవారం దేశం భగ్గుమంది. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలో సైన్య నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పలు రాష్ట్రాల్లో యువత ఆందోళనలు చేపట్టింది. ఇవి కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. ‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లకు నిప్పుపెట్టారు.

కొనసాగుతున్న ఆందోళన కారణంగా దాదాపు 200 రైలు సర్వీసులు ప్రభావితమయ్యాయి. దేశవ్యాప్తంగా 35 రైలు సర్వీసులు రద్దు కాగా.. 13 పాక్షికంగా రద్దు అయ్యాయి. బిహార్, యూపీల్లో.. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్రలతో రైల్వేస్టేషన్లలోకి ప్రవేశించిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. బిహార్‌లోని లఖీసరాయ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ రైలుకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఐదు కంపార్ట్‌మెంట్లు కాలిపోయాయి. ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో రైళ్లోని ప్రయాణికులు భయాందోళనలకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వీడియో తీయకుండా ఆందోళనకారులు.. తమ ఫోన్లను లాక్కున్నట్లు స్థానిక పోలీసు సిబ్బంది వెల్లడించారు.

బిహార్‌లోని మెహియుద్దీనగర్ స్టేషన్‌లో.. జమ్మూ తావీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లోని రెండు బోగీలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బెగూసరాయ్, బెట్టియా ప్రాంతాల్లోనూ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్రలతో రైల్వేస్టేషన్‌లలోకి ప్రవేశించిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఆందోళనలతో బిహార్‌లో రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం తలెత్తింది.

బిహార్​, బెట్టియాలోని ఆ రాష్ట్ర ​ ఉప ముఖ్యమంత్రి రేణు దేవికి చెందిన ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. తమ ఇంటిపై దాడి జరిగినట్లు ఆమె కుమారుడు తెలిపారు. ఈ దాడుల్లో భారీగా నష్టపోయామని చెప్పారు. ప్రస్తుతం రేణు దేవి పట్నాలో ఉన్నారని వెల్లడించారు. యూపీలోని బలియా జిల్లాలో ఓ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. రైలుబోగీలకు.. నిప్పుపెట్టారు. అక్కడున్న పోలీసు సిబ్బందిపైకి రాళ్లు విసిరినట్లు స్థానిక డీఎం సౌమ్య అగర్వాల్ వెల్లడించారు.

అసలేంటీ అగ్నిపథ్ స్కీమ్?: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంతో 17.5 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వారు త్రివిధ దళాల్లో చేరవచ్చు. నాలుగేళ్ల పాటు సేవలు అందించాక వీరిలో 25 శాతం మంది మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. ఈ పథకం కింద చేరిన వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 46,000 మంది సైనికుల నియామకం చేపట్టనుంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది. అయితే దీనిపై బుధవారం బిహార్‌లో మెల్లగా మొదలైన ఆందోళన శుక్రవారం వరకు పలు రాష్ట్రాలకు వ్యాపించాయి.

Show comments