Site icon NTV Telugu

Coal Mines: ప్రపంచంలో అతిపెద్ద 5 బొగ్గు గనుల్లో 2 మన దేశంలోనే..ఎక్కడంటే..

Gevra And Kusmunda Coal Mines

Gevra And Kusmunda Coal Mines

Coal Mines: ప్రపంచంలో 5 అతిపెద్ద బొగ్గు గనుల్లో ప్రస్తుతం రెండు మనదేశంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(SECL) ఆధ్వర్యంలోని గెవ్రా, కుస్ముండా బొగ్గు గనులు ప్రపంచంలో 10 అతిపెద్ద బొగ్గు గనుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. WorldAtlas.com విడుదల జాబితాలో ఈ రెండు గనులు వరసగా 2వ, 4వ స్థానాన్ని పొందాయి.

Read Also: Sunita Williams: మట్టి లేకుండా అంతరిక్షంలో మొక్కలు పెంచుతున్న సునీతా విలియమ్స్.. ఎలాగో తెలుసా?

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఉన్న ఈ రెండు గనులు ఏటా 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది భారతదేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 10 శాతం వాటాను కలిగి ఉంది. గెవ్రా ఓపెన్‌కాస్ట్ గని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 70 మిలియన్ టన్నులు. ఈ గని 2023-24 ఆర్థిక సంవత్సరంలో 59 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. గెవ్రా 1981 సంవత్సరంలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. రాబోయే 10 సంవత్సరాలకు గానూ దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి తగినంత బొగ్గు నిల్వలను కలిగి ఉంది. కుస్ముండా ఓపెన్‌కాస్ట్ గని 2023-24 ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి చేసింది. బొగ్గు ఉత్పత్తిలో ఇది గెవ్రా తర్వాతి రెండో స్థానంలో ఉంది.

ఈ గనుల నుంచి పర్యావరణ అనుకూల విధానాల ద్వారా బొగ్గుని వెలికి తీస్తున్నారు. పేలుళ్లు లేకుండా బొగ్గుని కత్తిరించే ‘సర్ఫేస్ మైనర్’ వంటి ప్రపంచంంలో అతిపెద్ద, అత్యాధునిక మైనింగ్ మిషన్లను మోహరించారు. ఓవర్‌బర్డెన్ తొలగింపు కోసం (బొగ్గు సీమ్‌ను బహిర్గతం చేయడానికి మట్టి, రాయి మొదలైన పొరలను తొలగించే ప్రక్రియ) 240 డంపర్లు, 42 క్యూబిక్ మీటర్లు పారని కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద HEMM (హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ)ని వీటిలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో టాప్ -5 అతిపెద్ద బొగ్గు గనుల్లో రెండు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని SECL సీఎండీ ప్రేమ్ సాగర్ మిశ్రా అన్నారు.

Exit mobile version