Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఈ రోజు తీవ్ర హింస చెలరేగింది. మొఘల్ కాలం నాటి జామా మసీదుపై కోర్టు సర్వేకి ఆదేశించింది. ఈ సర్వే కోసం వచ్చిన అధికారులపై స్థానికులు రాళ్లలో దాడికి పాల్పడ్డారు. పోలీసులకు, అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారి ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసింది. మసీదు హిందూ దేవాలయం ఉన్న స్థలంలో నిర్మించబడిందనే వాదనలపై కోర్టు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. అడ్వకేట్ కమీషనర్ నేతృత్వంలోని సర్వే టీం తన పని ప్రారంభించే సమయంలో మసీదు సమీపంలోని జనం గమిగూడటంతో హింస మొదలైంది. మసీదులోకి అధికారులు ప్రవేశించకుండా పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాదాపుగా 1000 మంది, సంఘటన స్థలంలో పోలీసులు, ఇతర అధికారులపై రాళ్లు రువ్వారు. పదికి పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..
సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన సర్వే, మంగళవారం కూడా కొనసాగుతుండటంతో సంభాల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. 1529లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ‘‘బాబర్నామా’’,‘‘ఐన్-ఏ-అక్బరీ’’ వంటి చారిత్రక గ్రంథాలలో ఉన్నట్లు పిటిషనర్లు వాదించారు. సర్వేలో చారిత్రక నిజాలను వెలికితీసేందుకు సర్వేని కోర్టు ఆదేశించింది. అయితే, మరో వర్గం మాత్రం 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకరాం.. సర్వే మత పవిత్రతను ఉల్లంఘించేలా ఉందని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 10 మంది వ్యక్తులను అధికారులు అదుపలోకి తీసుకున్నారు. ఉత్కంఠ నెలకొన్నా అధికారులు అనుకున్న ప్రకారం సర్వే పూర్తి చేశారు. న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకు వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ ద్వారా సర్వే బృందం సైట్ యొక్క వివరణాత్మక పరిశీలనను నిర్వహించింది. నవంబర్ 29లోగా సర్వే నివేదిక అందచేయాల్సి ఉంది. అయితే, ఈ ఘటన ఇప్పుడు యూపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ ఎన్నికల్లో అవకతవల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ హింసను ప్రేరేపించిందని సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ తన గుండాలతో దాడులకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది.