Bihar: ఓ వైపు లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీని గద్దె దించాలని భావిస్తున్న బీహార్‌లోని ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్ తగిలింది. ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల ‘మహాగటబంధన్’ కూటమికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పార్టీల ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధికార బీజేపీలో చేరారు.
Read Also: Citizenship Rules: 3 దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం.. వచ్చే నెలలో సీఏఏ రూల్స్ అమలు.?
బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మురారి ప్రసాద్ గౌతమ్, సిద్ధార్ధ్ సౌరవ్‌తో పాటు తేజస్వీ యాదవ్ ఆర్జేడీ పార్టీకి చెందిన సంగీత కుమారిలు మంగళవారం బీజేపీలో చేరారు. ఈ ముగ్గురు చేరికలో బీహార్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి కీలక పాత్ర పోషించారు. బీహార్ అసెంబ్లీ సెషన్‌లో ముగ్గురు అధికారపక్షంలో కూర్చోవడంతో వీరు పార్టీ మారినట్లు తెలిసింది. మురారి ప్రసాద్ గౌతమ్ చెన్నారి నియోజకవర్గం నుంచి సిద్ధార్థ్ సౌరవ్ విక్రమ్ నియోజకవర్గం నుంచి, సంగీతా దేవి మోహనియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
ఇటీవల జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో పొత్తును తెంచుకుని మళ్లీ బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇండియా కూటమి రూపశిల్పుల్లో ఒకరిగా ఉన్న నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడం ఇండియా కూటమికి భారీ దెబ్బతీసింది. 243 ఎమ్మెల్యేలు ఉన్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీయూ, హెచ్ఎఎం, స్వతంత్రులతో కలిపి ఏన్డీయేకు 128 ఎమ్మెల్యేల బలం ఉంది.