NTV Telugu Site icon

Amaranath Yatra: అమరనాథ్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Amaranath Cloudburst

Amaranath Cloudburst

పవిత్ర పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌ క్షేత్రానికి సమీపంలో శుక్రవారం అకస్మాత్తుగా వరద బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది. ఈ విపత్తులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందిదాకా గల్లంతైనట్లు ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ తెలిపారు. కొండల పైనుంచి భారీఎత్తున వర్షపు నీరు ముంచెత్తింది. కొండలపైనుంచి పెద్ద ఎత్తున రాళ్లు, బురద కొట్టుకొచ్చాయి. ప్రవాహ ఉద్ధృతికి అమర్‌నాథ్‌ క్షేత్రానికి సమీపంలోని బేస్‌ క్యాంప్‌ దెబ్బతింది. యాత్రికులకు ఆహారం అందించేందుకు ఏర్పాటుచేసిన 3 వంటశాలలు, 25 గుడారాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులేనని తెలుస్తోంది. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు, కేంద్ర బలగాలు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 15వేల మందిని కేంద్ర బలగాలు రక్షించాయి. వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.హెలికాప్టర్ల సాయంతో చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.ప్రస్తుతానికి, గాయపడిన వారికి మూడు ప్రాథమిక ఆస్పత్లుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆకస్మిక విపత్తు పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో మాట్లాడి ప్రధాని మోదీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వరద తాకిడికి గురైన వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమర్‌నాథ్‌ యాత్ర త్వరలోనే తిరిగి ప్రారంభమవుతుందన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి వ్యక్తంచేశారు. కాగా తక్షణ సహాయక చర్యలకు కేంద్ర బలగాలు, జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగానికి హోంమంత్రి అమిత్‌ షా ఆదేశాలిచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు, సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సిన్హా చెప్పారు.

Amarnath: అమర్‌నాథ్‌ యాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్.. నా కళ్ల ముందే అంతా..!

కుటుంబ సభ్యులతో అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన గోషామహల్‌ ఎమ్మెల్యే, తెలంగాణ భాజపా శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌లోథ్‌ విపత్తు ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం యాత్ర పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 43 రోజుల అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా అమర్ నాథ్ యాత్ర జరగలేదు. దీంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో యాత్రికులు అమర్ నాథ్ యాత్రకు వచ్చారు. అయితే నిన్నటి నుంచి అమర్ నాథ్ పరిసరాల్లో భారీగా వర్షం పడుతుండటంతో పాటు కొండలపై నుంచి మెరుపు వరదలు పరిసరాలను ముంచెత్తాయి. తాజా విపత్తు నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం ప్రత్యేక సహాయక కేంద్రాన్ని (హెల్ప్‌లైన్‌) ఏర్పాటు చేసింది.