State Bank Of India: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఆయా పోస్టుల్లో 1400 రెగ్యులర్ ఉద్యోగాలు ఉండగా.. మరో 22 బ్యాక్ లాగ్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 7 వరకు ఆయా ఉద్యోగాలకు అభ్యర్థులు అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా sbi.co.in లేదా ibpsonline.ibps.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
Read Also: Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..
1422 పోస్టుల్లో అసోం, అరుణాచల్ ప్రదేశ్ , మణిపూర్ , మేఘాలయ, మిజోరాం , నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి 300 పోస్టులు ఉన్నాయి. మహారాష్ట్ర, గోవాకు 212, రాజస్థాన్‌కు 201, తెలంగాణకు 176, ఒడిశా, పశ్చిమ బెంగాల్/సిక్కిం/అండమాన్ నికోబార్ దీవులకు 175.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు 175 పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి. కాగా ఎస్‌బీఐ ప్రకటించిన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలని భావిస్తున్న అభ్యర్థుల వయో పరిమితి 21-30 ఏళ్లుగా ఉండాలి. అయితే రిజర్వుడ్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు విద్యార్హత పొందిన తర్వాత రెండేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఏదైనా కమర్షియల్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్‌లో ఆఫీసర్‌గా పని చేసిన అనుభవం ఉండాలని సూచించారు. అభ్యర్థులకు ఏపీలోని గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.. తెలంగాణలోని హైదరాబాద్ సెంటర్లలో రాతపరీక్షలను నిర్వహించనున్నారు.