NTV Telugu Site icon

Delhi airport bomb scare: సరదా కోసం ఇలా చేస్తారా.. విమానంలో బాంబు ఉందని 13 ఏళ్ల బాలుడి బెదిరింపు..

Delhi Airport Bomb Scare

Delhi Airport Bomb Scare

Delhi airport bomb scare: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకి నకిలీ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. విమానంలో బాంబు పెట్టి పేల్చేస్తాంటూ ఈమెయిల్స్, అగంతకుల నుంచి ఫోన్స్ రావడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీనేజ్ మైనర్ బాలురు కూడా బెదిరించే స్థాయికి వెళ్లారు. తాజాగా 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు సరదా కోసం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు.

Read Also: Himanta Biswa Sarma: బంగ్లాకి చెందిన మైనారిటీలు కాంగ్రెస్‌కి ఓటేశారు.. హిందువులు..

బాలుడు ఉత్తరాఖండ్‌కి చెందినవాడిగా అధికారులు గుర్తించారు. దుబాయ్ వెళ్లే విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ పంపిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం తెలిపారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(ఐజీఐ ఎయిర్‌పోర్టు) ఉషా రంగనాని ప్రకారం.. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన 13 ఏళ్ల బాలుడు ఇలాగే బెదిరించడం చూసి తాను కూడా ఇదే పనిని చేసినట్లు బాలుడు చెప్పినట్లు తెలిపారు. జూన్ 17న ఢిల్లీ విమానాశ్రయానికి జూన్ 18న దుబాయ్‌కి వెళ్లాల్సిన విమానానికి సంబంధించి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఇది బూటకమని తేలింది.

సంబంధిత ఈమెయిల్ ఉత్తరాఖండ్ పితోర్గఢ్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఈమెయిల్ పంపడానికి స్కూల్ వర్క్‌ కోసం ఉపయోగించే మొబైల్ వాడాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడినట్లు బాలుడు తెలిపాడు. ఈమెయిల్ లింక్ చేసిన ఫోన్‌ని అధికారులు స్వాధీనం చేసుకుని, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నెల ప్రారంభంలో కెనడా టొరంటోకి వెళ్తున్న విమానంలో బాంబు ఉందని మీరట్‌కి చెందిన 13 ఏళ్ల బాలుడు ఈమెయిల్ పంపాడు.