NTV Telugu Site icon

Jackal attack: యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు.. దాడిలో 12 మంది గాయాలు..

Jackal Attack

Jackal Attack

Jackal attack: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తోడేళ్ల దాడులు కలవరపెడుతున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు బహ్రైచ్‌ జిల్లాలో వరసగా గ్రామాలపై దాడులకు తెగబడుతున్నాయి. జూలై నుంచి ఇప్పటి వరకు 8 మందిని చంపేశాయి. ఇందులో ఏడుగురు పిల్లలే ఉన్నారు. 30 మందిని గాయపరిచాయి. ప్రస్తుతం ఈ మ్యాన్ ఈటర్స్‌ని పట్టుకునేందుకు ఏకంగా ప్రభుత్వం 200 మంది అటవీ, పోలీస్ అధికారుల్ని రంగంలోకి దించింది. ఇప్పటికే నాలుగు తోడేళ్లను బంధించినప్పటికీ, దాడులు ఆగడం లేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు యూపీ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేసింది.

Read Also: Deepika Singh : పండగవేళ పాపకు జన్మనిచ్చిన దీపికా పదుకునే..

ఇదిలా ఉంటే, ఇప్పటికే తోడేళ్ల దాడుల వార్తలు సంచలనంగా మారిన వేళ, నక్కలు కూడా దాడులకు తెగబడుతున్నాయి. రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాలో రెండు గ్రామాల్లో నక్కలు దాడులు చేశాయి. ఐదుగురు చిన్నారులతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జహనాబాద్ ప్రాంతంలోని సుస్వార్, పన్సోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులుపై నక్కలు మొదటి దాడి చేశాయి. చిన్నారులను రక్షించేందుకు కొందరు వృద్ధులు వెళ్లగా వారిపై కూడా అటాక్ చేశాయి.

దాడి తర్వాత గాయపడిన మొత్తం 12 మందిని జహనాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చారు. అక్కడ వారికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది. నక్కల దాడిలో కోపోద్రిక్తులైన స్థానికులు అందులో ఒక దానిని చంపారు. నక్కల దాడి గురించి తెలిసిన వెంటనే స్థానిక అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తుున్నారు. నక్కల దాడిపై పిలిభిత్ ఎంపీ జతిన్ ప్రసాద అధికారులతో మాట్లాడారు.