ఓవైపు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నా.. మరోవైపు ప్రజలు మాత్రం భయం లేకుండా బయట తిరిగేస్తున్నారు.. టీవీల్లో, పేపర్లలో వార్తలు చూసినంతసేపు టెన్షన్ అనిపిస్తుంటే.. బయటకు వెళ్తే మాత్రం.. మనమే అనవసరంగా భయపడుతున్నామేమో అనుకోవాల్సిన పరిస్థితి. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. అన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి.. మాస్క్ లేకుండా బయటకు వస్తే.. రూ.వెయ్యి జరిమానాగా విధిస్తున్నాయి.. అయినా.. పెద్దగా మార్పు కనిపించకపోవడంతో.. ఉత్తరప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది..
కరోనా కట్టడిలో భాగంగా యూపీలో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ పాటించనున్నారు. అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.. ఇక మాస్క్ లేకుండా తిరిగేవారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు.. అదే, రెండోసారి మాస్క్ లేకుండా పట్టుబడితే మాత్రం జేబుకు చిల్లే ఎందుకంటే.. రెండో సారి మాస్క్ లేకుండా చిక్కిన వారికి ఏకంగా రూ.10 వేలు జరిమానా విధించనున్నారు.. కరోనా కేసులు, తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్, కోవిడ్ నివారణ చర్యలు తదితర అంశాలపై ఉన్నత అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన సీఎం యోగి.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, సీఎం యోగి కూడా కోవిడ్ బారినపడిన సంగతి తెలిసిందే.