Site icon NTV Telugu

CBI: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లోకి సీబీఐకి నో ఎంట్రీ..

Cbi

Cbi

10 States withdraws general consent to CBI, including telangana: తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరస్థితి ఏర్పడింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్ర లేదని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీనే కావాలని కట్టుకథలను అల్లుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి అనుమతిని నిరాకరించింది.

Read Also: Delhi: తుపాకీ గురి పెట్టి టయోటా ఫార్చ్యూనర్ కార్ దొంగతనం.. వైరల్ వీడియో..

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి సాధారణ సమ్మతిని విత్ డ్రా చేసుకుంటూ తెలంగాణతో పాటు పది రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో మేఘాలయ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మిజోరాం రాష్ట్రాలు సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. ఇలా చేసిన పదో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అంతకుముందు మహారాష్ట్ర కూడా సీబీఐకి అనుమతిని ఉపసంహరించుకుంది. కానీ ఆ తరువాత ఈ నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకుంది. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో బీహర్ పర్యటన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే విధంగా విమర్శలు చేశారు.

రెండు నెలల క్రితమే సీబీఐకి సాధారణ సమ్మతిని విత్ డ్రా చేసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. సీబీఐ విచారణ కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేస్తున్న సందర్భంలో అదనపు అడ్వకేట్ జనరల్ తెలంగాణ హైకోర్టుకు ఈ విషయం తెలియజేసే వరకు అది పబ్లిక్ డొమైన్ లో కనిపించలేదు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1946( కేంద్ర చట్టం XXV 1946) సెక్షన్ 6 కింద రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది.

Exit mobile version