Box Office: టాలీవుడ్లో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఒకటే ముచ్చట.. అదే ‘పాన్ ఇండియా’. చిన్న సినిమాగా వచ్చి ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా బాక్సాఫీస్‌ను ఊపేసిన ‘హనుమాన్’ సినిమా హిట్ కొట్టేసరికి, మన కుర్ర హీరోలందరిలో ఒకటే ఆలోచన మొదలైపోయింది. చిన్న హీరో కూడా దేశం మొత్తం సత్తా చాటొచ్చనే ధైర్యం రావడం మంచిదే. కానీ కథ, దమ్మున్న ఎమోషన్ లేకుండా కేవలం భారీ బడ్జెట్‌ను నమ్ముకుని దూకేస్తే ఎలా ఉంటుందో రీసెంట్గా వచ్చిన ‘నాగబంధం’ ఫలితమే అందరికీ కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇక్కడ మన మార్కెట్‌పైనే ఇంకా సరైన పట్టు చిక్కలేదు, అప్పుడే బాలీవుడ్ వరకు వెళ్లి జెండా పాతేయాలన్న తొందర ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఆ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
సాయి దుర్గతేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ కోసం ఏకంగా 125 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. తోడుగా సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ నటుడిని కూడా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మన దగ్గరే తన మార్కెట్‌ను గట్టిగా నిలబెట్టుకోవాల్సిన టైమ్‌లో ఇంత పెద్ద మొత్తం రిస్క్ చేయడం నిజంగా సాహసమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘క’ సినిమాతో ఇప్పుడిప్పుడే ఒక మంచి హిట్ చూశాడు కిరణ్ అబ్బవరం. వెంటనే ‘ఇంద్రపుత్ర’ అంటూ మైథలాజికల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎత్తేశాడు. బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఉన్నారన్న ధైర్యమేమో కానీ, హీరో రేంజ్‌కి మించి బడ్జెట్ పెంచేస్తే రేపు ఏమాత్రం తేడా కొట్టినా ఆ దెబ్బ తగిలేది నిర్మాత జేబుకే. సందీప్ కిషన్ కూడా ‘కరికాలా’ అంటూ సోషియో ఫాంటసీ కథతో రెడీ అవుతున్నాడు. పైగా దీన్ని రెండు భాగాలుగా తీస్తారట.
పాన్ ఇండియా సినిమా చేయాలని ఆశపడటం తప్పు కాదు. కానీ దానికి షార్ట్కట్లు ఉంటాయని అనుకోవడమే అసలు పొరపాటు. ‘హనుమాన్ అంశ్’ ఎందుకు ఆడింది? అందులో బలమైన కథ ఉంది, జనాల మనసుల్ని తాకే భక్తి భావం, ఎమోషన్ ఉన్నాయి. వీటన్నింటికీ మించి బడ్జెట్ కంట్రోల్లో ఉంది. ఆ మ్యాజిక్ ఎలా జరిగిందో అర్థం చేసుకోకుండా.. వందల కోట్ల సెట్లు, గ్రాఫిక్స్, బాలీవుడ్ యాక్టర్లను పెట్టేస్తే సినిమా దానంతట అదే హిట్ అయిపోతుందని అనుకుంటే చివరకు మిగిలేది పెద్ద దెబ్బే.

