భారతదేశపు సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. ‘కేజీఎఫ్’ తొలి భాగం భాషలకు అతీతంగా ఇండియన్ సినీ అభిమానులను అలరించింది. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ గా ‘ కేజీఎఫ్ 2’ వస్తోంది. కరోనాతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా విడుదలకు రెడీ అయింది.
ఏది ఏమైనా యశ్ తో పాటు ప్రశాంత్ నీల్ ఆరు సంవత్సరాలు ఈ రెండు భాగాల కోసం కష్టపడ్డారు. వీరు మరే సినిమా కమిట్ అవలేదు. మన తెలుగులో ‘బాహుబలి’ రెండు భాగాల కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో ‘కెజిఎఫ్’ కోసం యశ్ కూడా అంతే కష్టపడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతకాలం ఒకే తరహా లుక్ మెయింటెన్ చేస్తూ వచ్చాడు. తాజాగా సీక్వెల్ కి సంబంధించి డబ్బింగ్ ను పూర్తి చేశాడట యశ్. దాంతో ఆరేళ్ళ జర్నీకి పుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ప్రచారం ఒక్కటే మిగిలి ఉంది.’బాహుబలి’ కోసం ప్రభాస్, రాజమౌళి కూడా దాదాపు 4 ఏళ్ళకు పైగా కష్టపడ్డారు. ఆ కాలంలో వేరే ఏ సినిమా చేయలేదు. 2013లో తొలి భాగం షూటింగ్ మొదలు పెట్టి రెండో భాగం 2017 ఏప్రియల్ ఎండ్ లో విడుదల చేయటంతో వారిద్దరి ‘బాహుబలి’ జర్నీ ముగిసింది. చరిత్ర రాయబడింది. ఆ తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు యశ్ నెక్ట్స్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఉత్తర, దక్షిణాది బడా ఫిల్మ్ మేకర్స్ అందరి చూపు యశ్ పై ఉంది. ఏప్రిల్ 14న ‘కెజిఎఫ్2’ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ బాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా తర్వాత యశ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా స్థిరపడతాడేమో చూడాలి.