NTV Telugu Site icon

సినిమాలే యశ్ చోప్రా ప్రాణం!

(సెప్టెంబర్ 27న యశ్ రాజ్ చోప్రా జయంతి)

భారతీయ సినిమా రంగంలో అరుదైన అన్నదమ్ములు కొందరున్నారు. వారంతా ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నవారు. వారిలో బి.యన్.రెడ్డి – బి.నాగిరెడ్డి, రాజ్ కపూర్ – శశికపూర్, బి.ఆర్.చోప్రా – యశ్ రాజ్ చోప్రా సుప్రసిద్ధులు. అన్న బి.ఆర్.చోప్రా బాటలోనే పయనిస్తూ ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన యశ్ రాజ్ చోప్రా తరువాతి రోజుల్లో దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. రొమాంటిక్ మూవీస్ తెరకెక్కించడంలో మేటిగా నిలిచారు యశ్ చోప్రా. ఆయన నెలకొల్పిన యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ నాటికీ మేటి చిత్రాలను అందిస్తూనే ఉండడం విశేషం! యశ్ రాజ్ చోప్రా కీర్తి కిరీటంలో ఎన్నెన్నో అవార్డులూ, రివార్డులూ మేలిమి రత్నాలుగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రాణమున్నంత వరకూ సినిమాలు తీస్తూనే ఉంటానని చెప్పిన యశ్ రాజ్, దానిని నిలుపుకుంటూ ‘జబ్ తక్ హై జాన్’ అనే చిత్రాన్నే చివరగా రూపొందించడం గమనార్హం!

యశ్ రాజ్ చోప్రా 1932 సెప్టెంబర్ 27న లాహోర్ లో జన్మించారు. వారి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఎనిమిది మంది సంతానంలో యశ్ చోప్రా అందరికంటే చిన్నవాడు. యశ్ అన్నల్లో ఒకరైన బి.ఆర్.చోప్రా వద్ద, ఐ.ఎస్.జోహార్ వంటి దర్శకులకు సహాయకునిగా పనిచేశారు. యశ్ లోని చురుకుతనం చూసి అన్న బి.ఆర్.చోప్రా ఆయనను దర్శకునిగా పరిచయం చేశారు. తన 27 ఏళ్ళ వయసులో యశ్ చోప్రా ‘ధూళ్ కా ఫూల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 1959లో వెలుగు చూసిన ఈ చిత్రంలో రాజేంద్రకుమార్ హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో ఓ అనాథ బిడ్డను ముస్లిమ్ కుటుంబం చేరదీయడం, తరువాత ఎదురయ్యే పరిస్థితులతో కథ సాగుతుంది. ఇందులో “తూ హిందూ బనేగా న ముస్లిమ్ బనేగా… ఇన్సాన్ కీ ఔలాద్ హై… ఇన్సాన్ బనేగా…” పాట విశేషాదరణ చూరగొంది. మొదటినుంచీ ఆదర్శ భావాలున్న యశ్ చోప్రా తన చిత్రాల్లోనూ వాటిని చొప్పించారు. అవే ఆయనను జనానికి దగ్గర చేశాయి. వరుసగా యశ్ చోప్రా దర్శకత్వంలో ఆయన అన్న బి.ఆర్.చోప్రా నిర్మించిన “ధర్మ్ పుత్ర, వక్త్, ఆద్మీ ఔర్ ఇన్సాన్, ఇత్తే ఫక్” చిత్రాలు విజయం సాధించాయి. “వక్త, ఇత్తేఫక్” చిత్రాలు యశ్ చోప్రాను ఉత్తమ దర్శకునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డును అందించాయి. తరువాత తానే నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో ‘దాగ్’ తెరకెక్కించారు. రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన ఈ సినిమా విజయం సాధించింది. యశ్ రాజ్ దర్శకత్వంలో గుల్షన్ రాయ్ నిర్మించిన ‘దీవార్’ అమితాబ్ బచ్చన్ కు నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమాతో యశ్ రాజ్ ఉత్తమ దర్శకునిగా మూడో ఫిలిమ్ ఫేర్ ను అందుకున్నారు.

‘దీవార్’ వంటి యాక్షన్ – క్రైమ్ డ్రామాను తెరకెక్కించిన యశ్ రాజ్ తరువాత ‘కభీ కభీ’ లాంటి రొమాంటిక్ మూవీని రూపొందించారు. ఈ చిత్రం పాటలతో పరవశింప చేసింది. ఆ పై ఆయన దర్శకత్వంలో రూపొందిన “త్రిశూల్, కాలా పత్థర్, శిల్ శిలా, మషాల్, చాందినీ లమ్హే, డర్, దిల్ తో పాగల్ హై, వీర్-జరా, జబ్ తక్ హై జాన్” వంటి చిత్రాలు అలరించాయి. తన చిత్రాలలో శ్రీదేవితో తెరకెక్కించిన “చాందినీ, లమ్హే” బెస్ట్ అని ఆయనే చెప్పుకున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాలే కాదు, యశ్ నిర్మించిన సినిమాలు సైతం విజయకేతనం ఎగురవేశాయి. తనయుడు ఆదిత్య చోప్రా దర్శకత్వంలో యశ్ నిర్మించిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ చిత్రం దాదాపు 23 సంవత్సరాలు ఏకధాటిగా ముంబయ్ నగరంలో ప్రదర్శితమయింది. ఆయన చిన్నకొడుకు ఉదయ్ చోప్రా నటునిగా రాణిస్తున్నారు. యశ్ రాజ్ సినిమాలు అనగానే ముందుగా ఆయన పాటల చిత్రీకరణ గుర్తుకు వస్తుంది. ఆపై సదరు చిత్రాల్లోని రొమాన్స్ మన మదిని తడుతుంది.

భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ అవార్డులతో యశ్ చోప్రాను గౌరవించింది. 2012 అక్టోబర్ 21న యశ్ చోప్రా తుదిశ్వాస విడిచారు. ఈ నాటికీ ఆయన చిత్రాలు ఏదో ఒక రూపంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం!