NTV Telugu Site icon

Anantha Sriram: అలరించే పదవిన్యాసాల అనంత్ శ్రీరామ్!

Anantha Sriram

Anantha Sriram

Anantha Sriram: మిత్రకూటమికి దూరంగా చిత్రవిచిత్ర పదబంధాలతో రచనలు చేయడంలో మేటి అనంత్ శ్రీరామ్. ఉదాహరణకు ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో అనంత్ కలం పలికించిన “నజభజజజరా… గజగజవణికించే గజరాజడిగోరా…” అంటూ మొదలయ్యే పాట అదే తీరున సాగింది. ‘గజరాజు’ అంటే మత్తేభం కాబట్టి, ‘మత్తేభం’లోని గణాలు “స భ ర న మ య వ” కాకుండా, ‘చంపకమాల’లోని గణాలు “న జ భ జ జ జ ర” తీసుకొని పాటను రూపొందించారు అనంత్ శ్రీరామ్. అదో వైచిత్రి! అంతకు ముందు మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’లోని “కళావతి…” పాటలో- “వందో… ఒక వెయ్యో… ఒక లక్షో… మెరుపులు మీదికి దూకినాయా…” అంటూ చిత్రవిచిత్రంగా పాటను ప్రారంభించడంలోనే ఓ వైవిధ్యం ప్రదర్శించారు. ఇక ‘బాహుబలి’ మొదటి భాగంలో ‘పచ్చబొట్టు…’ పాటతో జనం మదిలో చెరిగిపోని ముద్రవేశారు అనంత్ శ్రీరామ్. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు చమత్కారాలు అనంతుని పాటల రచనలో మనల్ని పలకరిస్తాయి; పులకరింప చేస్తాయి. ఇప్పటికీ ప్రేక్షకులను అలరించే చిత్ర విచిత్ర ప్రయోగాల కోసం అనంత్ శ్రీరామ్ మది తపిస్తూనే ఉంది. తొలి చిత్రం ‘కాదంటే అవుననిలే’ టైటిల్ లోనే పింగళి వారి పదవిన్యాసం కనిపించడంతో అనంత్ కూడా హుషారుగా కలాన్ని పరుగులు తీయించారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా దాదాపు వేయి పాటలు అనంత్ శ్రీరామ్ కలం నుండి జాలువారి జనాన్ని మెప్పించాయి.

చేగొండి అనంత్ శ్రీరామ్ 1984 ఏప్రిల్ 8న పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డపట్లలో జన్మించారు. ఆయన కన్నవారు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. అనంత్ శ్రీరామ్ తండ్రి సత్యనారాయణకు మాజీ మంత్రి, చిత్ర నిర్మాత చేగొండి హరిరామజోగయ్య సమీపబంధువు. ఆయన ప్రోత్సాహంతోనే అనంత్ శ్రీరామ్ చిత్రసీమలో అడుగు పెట్టారు. ఊహలకు ఊపిరి వస్తే, వాస్తవాలు వెల్లివిరుస్తాయి అన్నారు విజ్ఞులు. అనంత్ శ్రీరామ్ పదబంధాలు సైతం అదే తీరున సాగాయి. అనుభవం లేని సందర్భాల్లోనూ ఊహాజనితమైన పదాలతో పరుగులు తీశారు. అవే అనంత్ శ్రీరామ్ ను ప్రత్యేకంగా నిలిపాయి. అనంత్ లోని సాహిత్యశోభను చూసి కీరవాణికి ముచ్చటేసింది. తాను స్వరకల్పన చేసే చిత్రాలలో అనంత్ ను ప్రోత్సహించారాయన. మరికొందరు సంగీత దర్శకులు, యువదర్శకులు కూడా తమ చిత్రాల్లోని సందర్భాలు వివరించగానే అనంత్ నోట పలికిన మాటలు విని ఆశ్చర్య పోయి, ఆ మాటలతోనే పాటలు రాయించుకున్నారు. తన దరికి చేరిన ఏ సినిమాకైనా న్యాయం చేయాలని తపిస్తుంటారు అనంత్ శ్రీరామ్. ఈ తపనలో అనేక చిత్రాలలో సింగిల్ కార్డ్ కూడా వేయించుకున్నారు. ‘ఎటో వెళ్ళి పోయింది మనసు’తో ఉత్తమ గీతరచయితగా నంది అవార్డును, ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నారు అనంత్. ఇతనిలోని సాహిత్యాభిలాషను గమనించిన ఎందరో అనంత్ కు మిత్రులుగా మారారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ రాసిన ‘ఎ లవ్, అన్ కండిషనల్’ రూపకల్పనలో అనంత్ శ్రీరామ్ పాత్ర కూడా ఉంది. ఇలా ఓ వైపు పాటలు రాస్తూనే, మరోవైపు తన దరికి చేరిన సాహితీగంధానికి తన పదాలతో మరింత సువాసన అద్దే ప్రయత్నం చేస్తుంటారు అనంత్ శ్రీరామ్. కేవలం పాటలు రాయడంలోనే కాదు కొన్ని చిత్రాలలో అనంత్ నటించారు కూడా. ఏది ఏమైనా, అనంత్ శ్రీరామ్ పాటలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. తెలుగు భాషాభిమానులు అనంత్ పదవిన్యాసాలను అధ్యయనం చేసినా, అభ్యాసం చేసినా పదరచనలో పట్టు దొరకక మానదు.

Show comments