Anantha Sriram: అలరించే పదవిన్యాసాల అనంత్ శ్రీరామ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantha Sriram: మిత్రకూటమికి దూరంగా చిత్రవిచిత్ర పదబంధాలతో రచనలు చేయడంలో మేటి అనంత్ శ్రీరామ్. ఉదాహరణకు ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో అనంత్ కలం పలికించిన “నజభజజజరా… గజగజవణికించే గజరాజడిగోరా…” అంటూ మొదలయ్యే పాట అదే తీరున సాగింది. ‘గజరాజు’ అంటే మత్తేభం కాబట్టి, ‘మత్తేభం’లోని గణాలు “స భ ర న మ య వ” కాకుండా, ‘చంపకమాల’లోని గణాలు “న జ భ జ జ జ ర” తీసుకొని పాటను రూపొందించారు అనంత్ శ్రీరామ్. అదో వైచిత్రి! అంతకు ముందు మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’లోని “కళావతి…” పాటలో- “వందో… ఒక వెయ్యో… ఒక లక్షో… మెరుపులు మీదికి దూకినాయా…” అంటూ చిత్రవిచిత్రంగా పాటను ప్రారంభించడంలోనే ఓ వైవిధ్యం ప్రదర్శించారు. ఇక ‘బాహుబలి’ మొదటి భాగంలో ‘పచ్చబొట్టు…’ పాటతో జనం మదిలో చెరిగిపోని ముద్రవేశారు అనంత్ శ్రీరామ్. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు చమత్కారాలు అనంతుని పాటల రచనలో మనల్ని పలకరిస్తాయి; పులకరింప చేస్తాయి. ఇప్పటికీ ప్రేక్షకులను అలరించే చిత్ర విచిత్ర ప్రయోగాల కోసం అనంత్ శ్రీరామ్ మది తపిస్తూనే ఉంది. తొలి చిత్రం ‘కాదంటే అవుననిలే’ టైటిల్ లోనే పింగళి వారి పదవిన్యాసం కనిపించడంతో అనంత్ కూడా హుషారుగా కలాన్ని పరుగులు తీయించారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా దాదాపు వేయి పాటలు అనంత్ శ్రీరామ్ కలం నుండి జాలువారి జనాన్ని మెప్పించాయి.
చేగొండి అనంత్ శ్రీరామ్ 1984 ఏప్రిల్ 8న పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డపట్లలో జన్మించారు. ఆయన కన్నవారు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. అనంత్ శ్రీరామ్ తండ్రి సత్యనారాయణకు మాజీ మంత్రి, చిత్ర నిర్మాత చేగొండి హరిరామజోగయ్య సమీపబంధువు. ఆయన ప్రోత్సాహంతోనే అనంత్ శ్రీరామ్ చిత్రసీమలో అడుగు పెట్టారు. ఊహలకు ఊపిరి వస్తే, వాస్తవాలు వెల్లివిరుస్తాయి అన్నారు విజ్ఞులు. అనంత్ శ్రీరామ్ పదబంధాలు సైతం అదే తీరున సాగాయి. అనుభవం లేని సందర్భాల్లోనూ ఊహాజనితమైన పదాలతో పరుగులు తీశారు. అవే అనంత్ శ్రీరామ్ ను ప్రత్యేకంగా నిలిపాయి. అనంత్ లోని సాహిత్యశోభను చూసి కీరవాణికి ముచ్చటేసింది. తాను స్వరకల్పన చేసే చిత్రాలలో అనంత్ ను ప్రోత్సహించారాయన. మరికొందరు సంగీత దర్శకులు, యువదర్శకులు కూడా తమ చిత్రాల్లోని సందర్భాలు వివరించగానే అనంత్ నోట పలికిన మాటలు విని ఆశ్చర్య పోయి, ఆ మాటలతోనే పాటలు రాయించుకున్నారు. తన దరికి చేరిన ఏ సినిమాకైనా న్యాయం చేయాలని తపిస్తుంటారు అనంత్ శ్రీరామ్. ఈ తపనలో అనేక చిత్రాలలో సింగిల్ కార్డ్ కూడా వేయించుకున్నారు. ‘ఎటో వెళ్ళి పోయింది మనసు’తో ఉత్తమ గీతరచయితగా నంది అవార్డును, ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నారు అనంత్. ఇతనిలోని సాహిత్యాభిలాషను గమనించిన ఎందరో అనంత్ కు మిత్రులుగా మారారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ రాసిన ‘ఎ లవ్, అన్ కండిషనల్’ రూపకల్పనలో అనంత్ శ్రీరామ్ పాత్ర కూడా ఉంది. ఇలా ఓ వైపు పాటలు రాస్తూనే, మరోవైపు తన దరికి చేరిన సాహితీగంధానికి తన పదాలతో మరింత సువాసన అద్దే ప్రయత్నం చేస్తుంటారు అనంత్ శ్రీరామ్. కేవలం పాటలు రాయడంలోనే కాదు కొన్ని చిత్రాలలో అనంత్ నటించారు కూడా. ఏది ఏమైనా, అనంత్ శ్రీరామ్ పాటలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. తెలుగు భాషాభిమానులు అనంత్ పదవిన్యాసాలను అధ్యయనం చేసినా, అభ్యాసం చేసినా పదరచనలో పట్టు దొరకక మానదు.
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!