NTV Telugu Site icon

Keeravani: నా ఫస్ట్ ఆస్కార్ రామ్ గోపాల్ వర్మతో పని చెయ్యడమే… అతని వల్లే అందరికీ తెలిసాను

Mm Keeravani

Mm Keeravani

ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయిన సంధర్భంగా నాటు నాటు పాటకి ఆస్కార్ గెలిచిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తనకి దక్కిన మొదటి ఆస్కార్ అవార్డ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో వర్క్ చెయ్యడమే అని చెప్పి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు కీరవాణి. “ఎంతోమంది దర్శక నిర్మాతలకి ట్యూన్స్ వినిపించాను. అందులో కొంతమందికి నా పాటలు నచ్చాయి, మరికొంత మందికి నచ్చలేదు. అయితే ఈరోజు నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది కానీ శివ సినిమా లాంటి సెన్సేషనల్ మూవీ చేసిన రామ్ గోపాల్ వర్మతో పని చేసే అవకాశం రావడమే నాకు ఫస్ట్ ఆస్కార్ గెలిచినట్లు. క్షణక్షణం సినిమాకి నేను మ్యూజిక్ ఇచ్చాను. క్షణక్షణం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్మ నన్ను సైన్ చేసిన తర్వాత సినిమా ప్రపంచం నన్ను సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించింది. క్షణక్షణం సినిమా విడుదలయ్యాక, అన్ని ప్రాంతాల నుండి ఆఫర్లు వెల్లువెత్తాయి. అందుకే RGVతో వర్క్ చెయ్యడాన్ని నా మొదటి ఆస్కార్‌గా భావిస్తాను” అని కీరవాణి చెప్పాడు.

క్షణ క్షణం సినిమా తర్వాత కీరవాణి, ఆర్జీవీ కలిసి పూర్తి స్థాయి సినిమా చెయ్యలేదు. ‘అంతం’ సినిమాకి మణిశర్మ, ఆర్డీ బర్మన్ తో పాటు కీరవాణి కూడా మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్జీవీతో ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడిన కీరవాణి… RGV ఈ రోజు వరకు మంచి మిత్రుడని, అయితే వారి మధ్య కొన్ని విభేదాలు/కష్టాలు ఉన్నప్పటికీ, బిజీ షెడ్యూల్స్ కారణంగా వర్మతో కొన్ని సినిమాలకి పని చేయలేకపోయాను. ఇప్పటికీ ఎన్ని డిఫరెన్స్ లు ఉన్నా వర్మ మంచి స్నేహితుడని కీరవాణి చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ బిట్ చూసిన రామ్ గోపాల్ వర్మ, “కీరవాణి నాకు నేను మరణించినట్లు అనిపిస్తుంది. చనిపోయిన వారినే అలా పొగుడుతారు” అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన క్షణ క్షణం సినిమాలోని ‘జామురాతిరి జాబిలమ్మ’ సాంగ్ ఇప్పటికీ ఎవరో ఒకరి ప్లే లిస్ట్ లో తప్పకుండా రిపీట్ అవుతూనే ఉంటుంది.

Show comments