ఆకాశంలో సగం మేమే అంటూ మహిళాలోకం సాగుతోంది. పురుషాధిక్య ప్రపంచంలోనూ తమకు తామే సాటి అని చాటింపేస్తున్నారు. రాజకీయాలు, క్రీడలు, చిత్రసీమ అన్నిటిలోనూ మహిళా ప్రభంజనం వీస్తోంది. తెలుగు సినిమాల్లో మేటి నాయికలుగా వెలుగొందిన ఎందరో తమదైన బాణీపలికించి, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. చిత్రసీమలో నటీమణులుగానే కాదు, రచయిత్రులుగా, దర్శకురాళ్ళుగా తమదైన సత్తా చాటుతున్నారు. దర్శకరచయిత్రి నందినీ రెడ్డి ప్రతిభకు పట్టం కడుతూ విఖ్యాత దర్శకులు కేవీ రెడ్డి పేరున నెలకొన్న అవార్డును ప్రదానం చేశారు. ఈ మధ్యనే ‘వరుడు కావలెను’ మూవీతో లక్ష్మీసౌజన్య మరో రచయిత్రి, దర్శకురాలుగా మారి తన టాలెంట్ ఏమిటో జనానికి చూపించారు. ఈ నవతరానికి స్ఫూర్తినిచ్చిన సినీ మహిళల్లో బహుముఖ ప్రజ్ఙాశాలి భానుమతినే ముందుగా పేర్కొనాలి. నటిగా, నర్తకిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతీ రామకృష్ణ చిత్రసీమలో జేజేలు అందుకున్నారు. ఆమెకు పూర్వం కానీ, తరువాత కానీ ఆ స్థాయిలో అలరించినవారు భారత చలనచిత్రసీమలోనే లేరని చెప్పవచ్చు.
తెలుగు చిత్రసీమ విషయానికి వస్తే, నిస్సందేహంగా అందరికీ భానుమతీ రామకృష్ణనే స్ఫూర్తి అని బల్లగుద్దేయవచ్చు. మరో మహానటి సావిత్రి సైతం దర్శకురాలిగా మెగాఫోన్ పట్టి కొన్ని చిత్రాలను రూపొందించారు. మహానటుడు యన్టీఆర్ కు ఈ ఇద్దరు నటీమణులు దర్శకత్వం చేయడం విశేషమనే చెప్పాలి. వీరి స్ఫూర్తితోనే దర్శకత్వంలో అడుగు పెట్టారు విజయనిర్మల. ఈమె కూడా నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అనితరసాధ్యంగా సాగారు. 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ లోనూ చోటు సంపాదించారు. తన భర్త కృష్ణతో అత్యధిక చిత్రాలలో నటించిన నాయికగానే కాదు, ఆయనను ఎక్కువ చిత్రాలలో దర్శకత్వం చేసిన లేడీ డైరెక్టర్ గానూ విజయనిర్మలపేరు సంపాదించారు. ఈమె దర్శకత్వంలో మహానటుడు ఏయన్నార్ కూడా నటించారు. నటి జీవిత సైతం తన భర్త రాజశేఖర్ హీరోగా రూపొందిన కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి, తనదైన రీతిలో సాగారు. తను ‘ఆంటీ’ అంటూ ఎంతో అభిమానంగా పిలుచుకొనే విజయనిర్మల స్ఫూర్తితో హీరో కృష్ణ కూతురు మంజుల సైతం నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా రాణించారు. సినిమాటోగ్రాఫర్ కావాలనుకొని, నటనలో అడుగు పెట్టిన సుహాసిని సైతం నిర్మాతగా, దర్శకురాలిగా తమిళ చిత్రాలు రూపొందించారు.
జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత్రి బి.జయ కూడా దర్శకురాలిగా అనేక చిత్రాలు రూపొందించారు. ఆమె తరువాత నందినీ రెడ్డి కూడా అదే స్థాయిలో చిత్రాలు రూపొందిస్తూ సాగుతున్నారు. నందిని తెరకెక్కించిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది. కరోనా ప్యాండమిక్ లో ఎంతోమంది ఔత్సాహికులైన అమ్మాయిలు చిత్రసీమలో పలు శాఖల్లో రాణించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. రచన,సినిమాటోగ్రఫి,దర్శకత్వం శాఖల్లోనే విశేషంగా మగువలు అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా గతంలో కన్నా మిన్నగా ప్రస్తుతం దక్షిణాదినే కాదు ఉత్తరాదిన సైతం పలు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్స్ వెలిశాయి. వాటిలో ఎందరో అమ్మాయిలు చిత్రసీమపై ఆసక్తితో తమకు నచ్చిన శాఖను ఎంచుకొని పరిశ్రమిస్తున్నారు. ఒకప్పుడంటే అవకాశాల కొరత కనిపించేది. కానీ, ఓటీటీ కారణంగా ఇప్పుడు మహిళలకు కూడా చిత్రసీమలో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో మరెంతోమంది మహిళలు ఈ షో బిజ్ లో తమదైన బాణీపలికించే సూచనలు కనిపిస్తున్నాయి. నందినీ రెడ్డి తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ లాగే ఇకపై చిత్రసీమలోనూ మగువలకు అన్నీ మంచి శకునములే ఉన్నాయని అనిపిస్తోంది. రాబోయే మహిళా దినోత్సవానికి మరికొందరు మగువలు కేవలం నటనలోనే కాకుండా, రచన, దర్శకత్వం, ఛాయాగ్రహణం వంటి శాఖల్లో అలరిస్తారని ఆశించవచ్చు.
(మార్చి 8న మహిళాదినోత్సవం)
