Site icon NTV Telugu

బన్నీకి ‘పుష్ప’ జాతీయ అవార్డు తెస్తుందా!?

allu-arjun

allu-arjun

ఈ నెల 17 అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రచారంలో తలమునకలై ఉన్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ట్రైలర్ తో పాటు పాటలు కూడా అన్ని భాషల్లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు అల్లు అర్జున్. ఇందులో గెటప్ కోసం తను తీసుకున్న శ్రమను ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు. దాదాపు రెండున్నర గంటలు మేకప్ కోసం వెచ్చించానని అలాగే మేకప్ తీయటానికి అరగంట పట్టేదని చెప్పాడు. ఒక్క మేకప్ విషయంలోనే కాదు చిత్తూరు యాసతో మాట్లాడుతూ పాత్ర ఔచిత్యానికి దగ్గరగా మెసలుకుంటూ వచ్చాడు. ఈ సినిమా రీరికార్డింగ్ తో బిజీగా ఉన్న దేవిశ్రీప్రసాద్ హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా రాలేక పోయాడు.

అయితే చెన్నైలో ఈవెంట్ కి మాత్రం హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బన్నీకి ‘పుష్ప’ సినిమాతో ఉత్తమనటుడుగా జాతీయఅవార్డు వస్తుందన్నదే ఆ కామెంట్. రీరికార్డ్ంగ్ చేస్తూ సినిమాను ఒకటికి పదిసార్లు చూసిన అనుభవంతో దేవిశ్రీ చెప్పిన మాట అది. నిజానికి వీరిద్దరి కలయికలో ఇంతకు ముందు కూడా పలు హిట్స్ వచ్చాయి. దేవి తెలుగులో టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు చేశాడు. అయితే ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి కామెంట్స్ చేసి ఉండలేదు. సినిమాలో అల్లు అర్జున్ నటనతోనే కాదు యాక్షన్ సీక్వెన్స్ లోనూ ఇరగదీశాడంటూ ప్రత్యేకించి ఓ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని, ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిలో వన్ ఆఫ్‌ ద బెస్ట్ అని చెబుతూ సినిమాపై అంచనాలను పెంచటమే కాదు బన్నీకి ఆవార్డుపై ఆశలు కూడా చిగురింప చేశాడు.

ఇటీవల కాలంలో తెలుగులో దేవిశ్రీప్రసాద్, తమన్ మధ్య మ్యూజికల్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా సినిమాలు చేస్తుండటమే కాదు పై చేయి అనిపించుకోవటానికి కూడా తాపత్రయపడుతున్నారు. గత ఏడాది బాక్సాఫీస్ వార్ లో తమన్ ‘అల వైకుంఠపురంలో’తో ఓ మెట్టు పైన ఉన్నాడు. ఈ ఏడాది కూడా వీరిద్దరి మధ్య నెక్ టు నెక్ వార్ జరుగుతోంది. ఇటీవల ‘అఖండ’తో తమన్ మరో హిట్ కొట్టగా ఇప్పుడు దేవిశ్రీ ‘పుష్ప’ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ చేయటం ద్వారా ముందున్నాడు. ఈ పోటీలో భాగంగా బన్నీకి జాతీయ అవార్డు ను మీడియా ముందుకు తీసుకు వచ్చాడా!? లేక నిజంగా సినిమాలో అల్లు అర్జున్ జాతీయస్థాయి అవార్డుకు సరిసమానమైన ప్రదర్శన ఇచ్చాడా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దేవి మాటలు నిజమై బన్నీకి జాతీయ అవార్డు వస్తే తెలుగు సినిమాకు కూడా పండగే. నిజం కావాలని కోరుకుందాం.

Exit mobile version