Balagam: కమెడియన్స్ గా వెండితెరపై రాణిస్తున్న వారు దర్శకులుగా మారడం కొత్త విషయం ఏమీ కాదు… గతంలో ఎంతోమంది కమెడియన్స్ తమ సత్తా చాటుకోవడానికి మెగా ఫోన్ చేతిలోకి తీసుకున్నారు. ఆ మధ్య కాలంలోనూ ఏవీయస్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు దర్శకులుగా కొన్ని సినిమాలు చేశారు. ఇక ‘వెన్నెల’తో కమెడియన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిశోర్ ‘వెన్నెల వన్ అండ్ హాఫ్’, ‘జఫ్పా’ చిత్రాలను డైరెక్ట్ చేశాడు. మొన్నటికి మొన్న కమెడియన్ శ్రీనివాసరెడ్డి స్వీయ దర్శకత్వంలో ‘భాగ్యనగర్ వీధుల్లో… గమ్మత్తు’ అనే సినిమాను నిర్మించాడు. పూర్తి స్థాయిలో కమెడియన్ కాకపోయినా వినోదాత్మక పాత్రలను వెండితెరపై పోషిస్తున్న అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలను ఇప్పటికే రూపొందించాడు. ఇతని తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ విడుదలకు సిద్థంగా ఉంది. జబర్దస్త్ షో తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లెట్ భాస్కర్ ‘బస్తీ బోయ్స్’ పేరుతో వెబ్ సీరిస్ రూపొందించాడు. ఇదిలా ఉంటే… గుర్తింపు ఉన్న మరో ఇద్దరు కమెడియన్స్ తాజాగా మెగా ఫోన్ చేతిలోకి తీసుకున్నారు.
హాస్యనటుడు వేణు తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. బుల్లితెర వీక్షకులకూ అతను బాగా తెలుసు. తాజాగా ఆహాలో వస్తున్న కామెడీ రియాల్టీ షోలోనూ వేణు పాల్గొంటున్నాడు. వినోదాత్మక పాత్రలతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న ఈ నటుడు ఇప్పుడు ‘బలగం’ అనే సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. విశేషం ఏమంటే… ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె హన్షిత, తన సోదరుడు హర్షిత్ రెడ్డితో కలిసి నిర్మిస్తోంది. ఈ సినిమాకోసం వీళ్ళు ‘దిల్ రాజు ప్రొడక్షన్’ అనే బ్యానర్ పెట్టారు. దీనికి శిరీష్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు కావాలనే తన ఐదేళ్ళ కల ఈ సినిమాతో నెరవేరడం ఆనందంగా ఉందని వేణు చెబుతున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా అయినప్పటికీ తెలుగు వారందరికీ కనెక్ట్ అవుతుందని అంటున్నాడు.
అలానే మరో హాస్యనటుడు అభయ్ బేతిగంటి తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామన్న యూత్’. దీన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్లో రజనీ నిర్మిస్తున్నారు. ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే ‘రామన్న యూత్’ కథ. అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, జబర్దస్త్ రోహిణి, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రెండు సినిమాలలోనూ వినోదమే ప్రధానాంశం. మరి తెలంగాణ గడ్డ నుండి వచ్చిన ఈ నటులు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాయో చూడాలి. రెండేళ్ళ క్రితం కిర్రాక్ ఆర్పీ సైతం డైరెక్టర్ కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ చిత్రం పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన మరే వార్త బయటకు రాలేదు.